Raju Weds Rambai: “రాజు వెడ్స్ రాంబాయి” మూవీ ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది – వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా “రాజు వెడ్స్ రాంబాయి”. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. “రాజు వెడ్స్ రాంబాయి” (Raju Weds Rambai) చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 21న “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాను వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు నిర్మాతలు వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి.
నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ
– ఖమ్మం, వరంగల్ జిల్లాల మధ్య జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారగా దర్శకుడు సాయిలు “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాకు స్క్రిప్ట్ చేశాడు. అతను నా దగ్గర వర్క్ చేస్తుండేవాడు. ఒకరోజు ఈ కథ నాకు నెరేట్ చేశాడు. వినగానే నన్ను కలచివేసింది. పరువు హత్యల గురించి మనం విన్నాం, ఇంకొన్ని విధాలుగా పరువు హత్య ఘటనలు జరగడం చూశాం. కానీ ఇలాంటి దుర్మార్గం ఏ ప్రేమకథలోనూ జరగలేదు అనిపించింది. ఇది వాస్తవ ఘటన నేపథ్యంగా సాగే సినిమా అయినా దర్శకుడు మెయిన్ స్ట్రీమ్ అప్పీల్ ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. సినిమా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది.
– ఈ సినిమాకు నేను ప్రొడ్యూసర్ అయితేనే న్యాయం జరుగుతుంది అనిపించింది ప్రొడ్యూసర్ గా మారాను. అప్పటికే ఈటీవీ వాళ్లు నన్ను ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే అసోసియేట్ కమ్మని అడిగారు. నేను “రాజు వెడ్స్ రాంబాయి” మూవీ గురించి చెప్పాను. వాళ్లు ఈ సినిమా చేస్తామంటూ ముందుకు వచ్చారు. ఆ తర్వాత వంశీ నందిపాటి, బన్నీవాస్ లాంటి రెప్యుటెడ్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మా మూవీతో అసోసియేట్ అయ్యారు. వీళ్లంతా కలిసి చేతులు కలపడం వల్ల మా సినిమా ప్రేక్షకుల దగ్గరకు సరైన విధంగా రీచ్ అవుతోంది.
– ఈ సినిమా ట్రైలర్ లో అమ్మాయిపై హీరో చేయి చేసుకోవడం చూపించాం. వాస్తవ ఘటన ఆధారంగా సినిమా చేసినా, మూవీలో డ్రామా లేకుంటే ప్రేక్షకులకు సినిమాటిక్ ఫీల్ కలగదు. ఈ మూవీలో విషాధకరమైన ముగింపు ఉండదు. ఒక మంచి ఫీల్ తో థియేటర్స్ నుంచి ఆడియెన్స్ బయటకు వస్తారు. “రాజు వెడ్స్ రాంబాయి” లాంటి సినిమా చూసి కొందరైనా అమ్మాయిల తండ్రులు ఆమె ప్రేమ విషయంలో పాజిటివ్ గా ఆలోచిస్తారని నమ్ముతున్నాం.
– సినిమాలో ఎక్కడా ఈ ఘటన జరిగిన ఊరు పేరు, బాధితులైన ఆ వ్యక్తుల పేర్లు చెప్పడం లేదు. సురేష్ బొబ్బిలి, నేను, మిట్టపల్లి సురేందర్ ఇండస్ట్రీలో స్ట్రగుల్స్ పడుతున్నప్పటి నుంచి స్నేహితులం. సురేష్ బొబ్బిలి అయితేనే ఇలాంటి రా అండ్ రస్టిక్ స్క్రిప్ట్ కు మంచి మ్యూజిక్ ఇవ్వగలడు అనిపించింది. నేను రూపొందించిన విరాటపర్వం సినిమా కూడా వాస్తవ ఘటనల నేపథ్యంగానే సాగుతుంది. అయితే ఆ సినిమాకు ఏం జరిగిందో ఓపెన్ గా చెప్పగలం. వారి కుటుంబ సభ్యులు కూడా మా అమ్మాయికి అన్యాయం జరిగిందని బయటకు వచ్చి మాట్లాడారు. కానీ ఈ ఘటన గురించి ఓపెన్ గా మాట్లాడుకోలేం.
– ఈ సినిమాకు హీరో అఖిల్ త్వరగానే దొరికాడు కానీ అమ్మాయి విషయంలో చాలా సెర్చ్ చేయాల్సివచ్చింది. ఇది లోకల్, రూటెడ్ స్టోరీ కాబట్టి తెలుగు అమ్మాయినే తీసుకోవాలి అనుకున్నాం, పైగా తెలుగు అమ్మాయిని ఎంకరేజ్ చేసినట్లు ఉంటుందని భావించాం. ఒక రోజు తేజస్వినీ ప్రొఫైల్ చూసి వెంటనే ఓకే చేశాం. ఆ తర్వాత ఈ ఇద్దరితో వర్క్ షాప్స్ చేయించాం. ఆ ఊరికి వెళ్లి లోకల్ ఆర్టిస్టులతో కలిపి వర్క్ షాప్స్ చేశాం. అఖిల్, తేజస్వినీ తమ పాత్రల్లో ఎంతో సహజంగా నటించారు. హీరోయిన్ తండ్రి వెంకన్న పాత్ర కోసం ఆడిషన్ చేస్తే చైతన్య వచ్చాడు. అతను ఎవరు అనేది మాకు ముందుగా తెలియదు. చూస్తే ఫారినర్ లా ఉన్నాడు మన క్యారెక్టర్ కు సెట్ కాడు అని డైరెక్టర్ సాయిలు నాతో అన్నాడు. చైతన్యలో ఒక సైక్ లుక్ కనిపించింది. అతని ప్రవర్తన కూడా కొత్తగా ఉంది. ఇతను వెంకన్న క్యారెక్టర్ కు బాగుంటాడు ఆడిషన్ చేయి అని డైరెక్టర్ తో చెప్పాను. ఆడిషన్ చేసి ఓకే అని సాయిలు చెప్పాడు. చైతన్య అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. నటన మీద ప్యాషన్ తో యూఎస్ నుంచి హైదరాబాద్ కు మా ఆడిషన్ కోసం తిరిగేవాడు. ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్దిమంది మంచి నటుల్లో చైతన్య ఒకరిగా గుర్తింపు దక్కించుకున్నాడు. అతన్ని సెలెక్ట్ చేశాక తెలిసింది హీరో సిద్ధు జొన్నలగడ్డ బ్రదర్ అని.
– బేబి, 7జీ బృందావన్ కాలనీ, సైరత్, ప్రేమిస్తేలా “రాజు వెడ్స్ రాంబాయి” మూవీ ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. నేను ప్రొడ్యూసర్ గా చేయాలని కాదు ఏదైనా మంచి కాన్సెప్ట్, పర్పస్ ఫుల్ కథ దొరికితే దాన్ని ప్రేక్షకులకు సరైన విధంగా చేర్చాలనే ప్రయత్నంలో నిర్మాతగా మారాను. నిర్మాతగా మారాక ప్రొడక్షన్ లో ఉన్న స్ట్రగుల్స్ తెలిశాయి. నేను చదివిన నవలల్లో అంటరాని వసంతం, రచయిత కేశవరెడ్డి రచనల్ని సిరీస్ లా చేస్తే బాగుంటుందనే ఆలోచన ఉంది. యూవీ సంస్థలో నా దర్శకత్వంలో మూవీ ఉంటుంది. హీరో ఎవరు అనేది వాళ్లు అనౌన్స్ చేస్తారు.
నిర్మాత రాహుల్ మోపిదేవి మాట్లాడుతూ
– ఓ ప్రేమ జంట జీవితంలో జరిగిన వాస్తవ ఘటన 15 ఏళ్లుగా అక్కడే సమాధి చేయబడింది. ఆ ఘటన గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మా డైరెక్టర్ సాయిలు అదే ప్రాంతానికి చెందినవాడు కాబట్టి, ఆ ఘటన గురించి తెలుసుకుని, ఆ నేపథ్యంతోనే మంచి డ్రామా యాడ్ చేసి అందరూ థియేట్రికల్ గా చూసేలా “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాను రూపొందించాడు.
ఘటన జరిగిన ప్రాంతంలోనే సినిమా షూటింగ్ జరిపాం. అక్కడ సెల్ సిగ్నల్స్ కూడా ఉండేవి కావు. 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోటల్ నుంచి రోజూ ఆ ఊరికి వెళ్లి వస్తూ షూటింగ్ చేశాం. ఆ గ్రామంలోని వారినే కొందరిని చిన్న చిన్న పాత్రలకు తీసుకున్నాం. వారికి యాక్టింగ్ లో వర్క్ షాప్స్ పెట్టాం. మా డైరెక్టర్ సినిమా మేకింగ్ లో ప్రతి చిన్న డీటెయిల్ విషయంలో క్లారిటీగా ఉన్నాడు.
– రాజు క్యారెక్టర్ చేసిన అఖిల్ వరంగల్ అబ్బాయి తనకు తెలంగాణ యాస ప్రాబ్లమ్ కాదు, తేజస్వినీ ఏపీ అమ్మాయి, కానీ తెలంగాణ యాసలో డైలాగ్స్ పర్పెక్ట్ గా చెప్పింది. రాజు రాంబాయిగా వీళ్లద్దరు అద్భుతంగా నటించారు. ఈ సినిమా షూటింగ్ కోసం టీమ్ చాలా కష్టపడింది. మారుమూల గ్రామంలో షూటింగ్ చేశాం. అది వర్షాకాలం కాబట్టి వర్షాలు, వరదలు వచ్చేవి. రోజుకో ప్రాబ్లమ్ ఎదురయ్యేది. కానీ షూటింగ్ బాగా వస్తుందనే ఒకే ఒక విషయం మమ్మల్ని సంతృప్తి పడేలా చేసేది. ఒకరోజు బ్రిడ్జి కొట్టుకుపోయింది. 80 మంది యూనిట్ అంతా ఆ రాత్రి ఊరిలోనే ఉండిపోవాల్సివచ్చింది.
టెలివిజన్ లో ప్రొడక్షన్ చేసిన అనుభవంతో ఈ మూవీకి వర్క్ చేయడం సులువైంది. మా సినిమాను ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే విడుదల చేస్తున్నాం.






