Thandel Review: చైతు, సాయి పల్లవిల నటనే హై లేట్ గా ‘తండేల్’

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
బ్యానర్: గీతాఆర్ట్స్
తారాగణం: నాగచైతన్య, సాయిపల్లవి, కరుణాకరన్, నరేన్ తదితరులు
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ : శమ్దాత్
ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగల
సమర్పణ: అల్లు అరవింద్, నిర్మాత: బన్నీ వాసు
రచన, దర్శకత్వం: చందూ మొండేటి
విడుదల తేది : 07.02.2025
నిడివి : 2 ఘంటల 32 నిమిషాలు
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య,(Naga Chaitanya) స్టార్ హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi)జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ‘కార్తికేయ-2’ లాంటి బంపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ చందూ మొండేటి(Chandu Modeti) దర్శకత్వంలో సక్సెస్‌ఫుల్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Aravind Presents) సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు (Bunny Vass)నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఇప్పటికే ఈ చిత్రం ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో చేసి మంచి బజ్జ్ క్రియేట్ చేసారు. మరి తండేల్ రాజు పాత్రలో జీవించిన నాగ చైతన్య, సక్సెస్ కొట్టాడా లేదా అన్నది సమీక్షలో చూద్దాం.
కథ :
మత్స్యకారులు జీవనవిధానాన్ని కళ్లకి కట్టినట్టు చూపించే చిత్రం ‘తండేల్’. తండేల్ అంటే గుజరాతీపదం. గుజరాత్‌లోని మత్య్యకారులు ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. తండేల్ అంటే లీడర్, కెప్టెన్ ఆఫ్ ది బోట్ అని అర్థం. వేటకు వెళ్లే సమయంలో ప్రతి బోటులోనూ 10 మందికిపైగా జాలర్లు ఉంటారు. ఇలా చాలా బోట్లలో వేటకి వెళ్తుంటారు. వీళ్లందర్నీ సమన్వయం చేసుకుంటూ.. జాలర్ల సమూహానికి లీడర్‌గా ఉండే వ్యక్తిని ‘తండేల్’ అని పిలుస్తుంటారు. శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశం గ్రామంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లిన ఫిక్షనల్ లవ్ స్టోరీ ‘తండేల్’. జాలరి కుటుంబాలకు చెందిన రాజు (నాగచైతన్య), బుజ్జితల్లి సత్య (సాయిపల్లవి) చిన్నతనం నుంచి సముద్రమంత ప్రేమ తో ప్రేమించుకొంటారు. ప్రతీ ఏటా కొన్ని నెలలు పాటు వేటకు రాజు తన గ్రామస్థులతో కలిసి వెళ్తుంటారు. అలా కొన్ని నెలలపాటు రాజు కోసం ఎదురు చూస్తూ ఆయన ప్రేమకై పరితపిస్తుంటుంది.
ఈ క్రమంలో భారీ తుఫాన్‌లో చిక్కుకొన్న రాజు బృందం భారతీయ సముద్ర జలాల సరిహద్దు దాటి పాకిస్థాన్‌లోకి ప్రవేశిస్తారు. పాకిస్తాన్ కోస్ట్‌గార్డ్‌లకు బంధీగా దొరికిపోతాడు. ఇక ఇదిలా ఉండగా, తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన రాజును కాదనుకొని వేరే వ్యక్తితో బుజ్జితల్లి పెళ్లికి సిద్దపడుతుంది. మరి రాజు ఆ చెర నుండి ఎలా బయటపడ్డాడు? తండేల్ అంటే లీడర్‌గా తనతో పాటు వచ్చిన 22 మంది జాలర్ల కోసం ఎలాంటి తెగింపుకు పాల్పడ్డాడు. తన తోటి జాలర్ల కోసం ఎలాంటి యుద్ధం చేశాడు? రాజు కోసం బుజ్జితల్లి చేసిన సాహసం ఏంటి? అనేదే ‘తండేల్’ కథ.
నటీనటుల హవబవాలు :
తండేల్ సినిమాను ఆద్యంతం సాయిపల్లవి మెట్టు ఎక్కించే ప్రయత్నం చేసింది. కథాపరంగా ఉన్న కొన్ని లోపాలను కూడా తన పెర్ఫార్మెన్స్‌తో కనిపించకుండా చేసేలా నటించింది. సత్య పాత్రలో జీవించింది. చాలా సన్నివేశాల్లో ఉద్వేగభరితమైన నటనతో ప్రేక్షకుడిని కంటతడి పెట్టించేలా చేస్తుంది. నాగచైతన్య విషయానికి వస్తే.. నటుడు తనకి తగ్గ పాత్రని ఎంచుకుని ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం ఒక ఎత్తైతే.. అసలు తనకి సూటేకానీ పాత్రని ఎంచుకుని.. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం మరో ఎత్తు. ‘తండేల్’ రాజు పాత్రతో నాగ చైతన్య పెద్ద సాహసమే చేశారు. చూడ్డానికి చాక్లెట్ బాయ్‌లా అనిపించే నాగ చైతన్య.. చేపలు పట్టే మత్స్యకారుడిగా మెప్పించడం కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. జాలరి పాత్రను తనలో ఇమిడింపజేసుకోవడం కోసం నేరుగా ఆయా ప్రాంతాలను తిరిగి.. అక్కడ జాలర్ల జీవనస్థితిని అర్థం చేసుకుని శ్రీకాకుళం యాస, భాషలను నేర్చుకున్నారు. తండేల్ రాజు పాత్రని పండించడం కోసం అతను పడిన కష్టం.. తెరపై కనిపిస్తుంది. తన కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మిగితా పాత్రల్లో దివ్య పిళ్లై, బబ్లూ పృథ్వీరాజ్, తమిళ నటులు కరుణాకరన్, ఆడుక్కాలమ్ నరేన్, పాకిస్థాన్ జైలర్ పాత్రలో ప్రకాశ్ బేలవాడి, మహేష్ ఆచంట తన పాత్రలకు తగినట్టుగా నటించారు.
సాంకేతికవర్గం పనితీరు:
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. చందూ మొండేటి రాసిన కథనం మరియు పాత్రలు ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కథను దర్శకుడు చాలా సున్నితంగా నడుపుతూ.. సినిమాలో ప్రేమతో పాటు ఆ ప్రేమలోని ఎమోషన్ని, పెయిన్ని కూడా హైలెట్ అయ్యే విధంగా కొన్ని ఏమోషనల్ సన్నివేశాలను చాలా బాగా మలిచాడు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్, మ్యూజిక్, నాగేంద్ర ఆర్ట్ వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్. ఈ సినిమాలో తండేల్ రాజు నాగ చైతన్య అయితే.. తండేల్ రాణి సాయి పల్లవి. అయితే ఈ ఇద్దరే కాకుండా ఈ సినిమాకి మరో తండేల్ అంటే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ దేవి శ్రీ అందించిన నేపథ్య సంగీతం ‘తండేల్’ని నిలబెట్టింది. చాలా ఏళ్ల తరువాత మళ్లీ ఆస్థాయిలో ‘తండేల్’ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు దేవి శ్రీ ప్రసాద్. బుజ్జితల్లి పాట అయితే వినడానికి ఎంత వినసొంపుగా ఉందో.. చూడ్డానికి అంతకిమించే ఉంది. రాజు, సత్యల మధ్య కోర్ ఎమోషన్స్ అన్నీ ఈ పాటలోనే మిళితం అయ్యి ఉంటాయి. థియేటర్స్‌ని నుంచి బయటకు వచ్చేప్పుడు.. ‘బుజ్జితల్లీ’ అని ఆడియన్స్‌తో హమ్ చేసుకుంటూ వెళ్లేట్టుగా మ్యాజిక్ చేశాడు దేవి శ్రీ. చాలా చోట్ల పేలవమైన సన్నివేశాలకు కూడా దేవీ శ్రీ ప్రసాద్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో బాగా ఎలివేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. బన్నీ వాసు అనుసరించిన నిర్మాణ విలువలు క్లాస్‌గా ఉన్నాయి.
విశ్లేషణ:
జాలర్ల కుటుంబాల్లో ఉండే వెతలు, సాధకబాధకాల బ్యాక్ డ్రాప్‌తో ఎమోషనల్ లవ్ స్టోరి, దేశభక్తి అంశాలను కలిపి రూపొందించిన చిత్రం తండేల్. నటీనటుల పెర్ఫార్మెన్స్ ఈ సినిమాను నిలబెట్టాయని చెప్పాలి. సాయిపల్లవి పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు బ్యాక్ బోన్ కాగా.. నాగచైతన్య యాక్టింగ్ సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్. టెక్నికల్ అంశాలు సినిమాలో డామినేట్ చేసే అంశాలుగా కనిపిస్తాయి. కథ, కథనాల పరంగా చందూ మొండేటి ఇంకా బాగా వర్క్ చేసి ఉండాల్సిందనిపిస్తుంది. లాజిక్స్, స్క్రిప్టుపరంగా లోపాలను వెతక్కుండా సినిమా చూస్తే.. సినిమా తెగ నచ్చేస్తుంది. లవ్ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్స్ కొత్త అనుభూతిని పంచుతాయి. ఈ సినిమా పక్కాగా థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ సినిమా.నాగ చైతన్య, సాయిపల్లవిల యాక్టింగ్ కోసం ఈ సినిమాను తప్పక చూడండి.