Lawrence: ప్లీజ్ నన్ను కలువు.. లారెన్స్ ఎమోషనల్ పోస్ట్

యాక్టర్ గా, డ్యాన్స్ మాస్టర్ గా, డైరెక్టర్ గా, నిర్మాతగా ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్(Raghava Lawrence). హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసిన లారెన్స్ వద్దకు ఎవరైనా సాయం కోరి వెళ్తే ఆయన వారందరినీ అక్కున చేర్చుకుంటారనే సంగతి తెలిసిందే. ఆశ్రమాలు నిర్మించి ఎంతోమంది పేదలకు నీడను కల్పించిన ఆయన చాలా మంది అనాథలను చేరదీసి వారికి చదువు చెప్పించి మంచి లైఫ్ ను ఇచ్చారు లారెన్స్.
లారెన్స్ మాస్(Mass) మూవీ చేస్తున్న టైమ్ లో ఓ చైల్డ్ ఆర్టిస్టును దత్తత తీసుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా 50కి పైగా సినిమాల్లో నటించిన రవి రాథోడ్(ravi rathod) అనే చైల్డ్ ఆర్టిస్టును లారెన్స్ దత్తత తీసుకుని స్కూల్ లో జాయిన్ చేయగా, తర్వాత సంవత్సరం హాలిడేస్ టైమ్ లో రవి హాస్టల్ నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు. అప్పట్నుంచి ఆ పిల్లాడి కోసం లారెన్స్ వెతుకుతూనే ఉన్నప్పటికీ ఎక్కడా అతని జాడ దొరకలేదు.
రీసెంట్ గా రవి రాథోడ్ ఓ యూట్యూబ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లారెన్స్ గురించి మాట్లాడారు. లారెన్స్ తనను దత్తత తీసుకుని స్కూల్ లో చేర్పిస్తే తాను ఆ ఛాన్స్ ను సరిగ్గా వాడుకోలేకపోయానని, హాస్టల్ నుంచి పారిపోయాక మళ్లీ ఎప్పుడూ అటు వైపు వెళ్లలేదని, ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్తే తిడతారో, కొడతారోననే భయముందని రవి చెప్పగా, ఆ వీడియో చూసి ఇప్పుడు లారెన్స్ రెస్పాండ్ అయ్యారు. నిన్ను చూస్తుంటే నా గుండె బరువెక్కుతుందని, ఇన్నేళ్ల తర్వాత మళ్లీ నిన్ను చూడటం చాలా సంతోషంగా ఉందని, నేను నిన్ను కొట్టను, తిట్టను, ఒకసారి వచ్చి కలువు, నిన్ను చూడాలనుంది, నీ కోసం ఎదురుచూస్తుంటానని లారెన్స్ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.