Pushpa2 Review: ‘పుష్ప 2 ది రూల్’ మాస్ జాతర

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3.5/5
నిర్మాణ సంస్తలు : మైత్రి మూవీ మేకర్, సుకుమార్ రైటింగ్స్,
నటినటులు : అల్లు అర్జున్, రాష్మిక మందన్నా, ఫాహాద్ ఫాజిల్,జగపతి బాబు, జగదీశ్ ప్రతాప్ బండారి,సునీల్,అనసూయ భరద్వాజ్, రావు రమేష్, ధనంజయ్, బ్రహ్మాజీ,అజయ్, శ్రీ తేజ్,షణ్ముఖ,సత్య, తారక్ పొంనప్ప, పావని కరణం, సౌరభ్ సచ్దేవ్, ఆదిత్య మీనన్,మైం గోపి, కల్పలత, దయానంద రెడ్డి తదితరులు నటించారు.
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ : మిరొస్లవ్ కుబ బ్రోజెక్,
ఎడిటర్ : నవీన్ నూలి, మాటలు : సుకుమార్, శ్రీ కాంత్ విస్సా,
పాటలు : చంద్ర బోస్, సి ఈ ఓ : చిరంజీవి, (చెర్రీ)
నిర్మాతలు : నవీన్ ఏర్నేన్ని, యలమంచలి రవి శంకర్,
దర్శకత్వం : సుకుమార్,
విడుదల తేది : 05.12.2024
నిడివి : 3 ఘంటల 20 నిమిషాల 28 సెకన్లు
టాలీవుడ్ తో పాటు బాలీవుడ్,కోలివుడ్,శాండల్ వుడ్,మాలి వుడ్ ఇలా అన్ని వుడ్డులు ఎదురు చూస్తున్న మూవీ పుష్ప 2 ది రూల్ గత మూడేళ్ళుగా నిర్మాణంలో ఉండి అల్లు అర్జున్ కెరీర్ లోనే కాదు తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమాల్లో ఒకటిగా నిలిచిన ‘పుష్ప 2 ది రూల్’ ఈ రోజు కాదు నిన్ననే థియేటర్లకు వచ్చేసింది. ముందు రోజు రాత్రే ప్రీమియర్లు వేయడం ద్వారా అతి పెద్ద రిస్కు తీసుకున్న మైత్రి దానికి తగ్గ గొప్ప విజయాన్నిఅందుకోవడం ఖాయమని నిన్నటి రిపోర్ట్స్ చెబుతున్నాయి. అధికారికంగా ఈ రోజు విడుదలైన ‘పుష్ప 2 ది రూల్’ లో పుష్పరాజ్ వీరంగం ఏ స్థాయిలో ఉంటుందోనని యావత్ భారతావని సైతం ఎదురు చూస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 150 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్టు చెబుతున్న ట్రేడ్ టాక్ చూస్తే మతులు పోవడం ఖాయం. రాజమౌళి బ్రాండ్ లేకుండా, విఎఫెక్స్ ఎక్కువ డిమాండ్ చేసే ఫాంటసీ సబ్జెక్టు కాకుండా ఇంత హైప్ ఏర్పడటం చూస్తే పుష్ప బ్రాండ్ దేశమంతా ఏ స్థాయిలో పాకిపోయిందో అర్థం చేసుకోవచ్చు. డబ్బింగ్ సినిమాలను అంతగా పట్టించుకోని బీహార్ లాంటి రాష్ట్రంలో సైతం ముందస్తు షోలతోనే కోటి దాటించడం పుష్ప ర్యాంపేజ్ కి నిదర్శనం. ప్రధాన నగరాలు తిరిగి బన్నీ చేసుకున్న ప్రమోషన్లు మాములు రీచ్ తేలేదు. పాట్నా నుంచి హైదరాబాద్ దాకా అన్ని ఈవెంట్లు బ్లాక్ బస్టరే. అమాంతం హైప్ పెంచేశాయి. అడ్డంకులు కూడా పుష్ప 2కి గట్టిగా పలకరించాయి. తమిళనాడులో తుఫాను ఓపెనింగ్స్ ని ప్రభావితం చేసింది. కర్ణాటకలో తెల్లవారుఝాము షోలు హఠాత్తుగా రద్దు చేయడం శరాఘాతం అయ్యింది. సోషల్ మీడియాలో ఒక వర్గం కావాలని నెగటివ్ క్యాంపైన్ చేస్తోందని బన్నీ ఫ్యాన్స్ ఆరోపించారు. ఇలా చుట్టూ అనుకోని చిక్కులు చుట్టుకోవడం పుష్ప 2ని ఇబ్బందుల్లో నెట్టినా ఆడియన్స్ లో ఏర్పడ్డ అంచనాలు మొదటి రోజు ఎలాగైనా చూడాలన్న సంకల్పాన్ని కలిగించాయి. మరి సినిమా ఎలా వుందో మన సమీక్షలో చూద్దాం.
కథ :
‘‘ఒకడూ పుష్పా అంటే ఫ్లవర్ అనుకున్నాడు.. వాడికి ఫైర్ అని చూపించి వచ్చినా.. ఎవ్వడైనా రానియ్.. ఏదైనా కానియ్.. తగ్గేదేలే.. అసలు ఆట ఇప్పుడే మొదలైంది’’ అంటూ పెళ్లి పీటలపై శ్రీవల్లి మెడలో తాళి కడుతూ ఫస్ట్ పార్ట్‌కి ఎండ్ కార్డ్ వేసిన పుష్పరాజ్.. సెకండ్ పార్ట్‌లో వైల్డ్ ఫైర్ చూపించాడు. అది ఏ రేంజ్‌లో ఉందంటే.. ‘‘ఎవడ్రా బాస్.. ఎవడికి రా బాస్’’ ఈ ఒక్క డైలాగ్‌తో ‘పుష్ప’లో వాడీవేడీ దీనవ్వా తగ్గేదేలే అని ఎంట్రీ సీన్‌తోనే ఫైర్ స్టార్ట్ చేశాడు. చూడబోతున్నది మామూలు ఫైర్ కాదు.. వైల్డ్ ఫైర్ అని చెప్పకనే చెప్పాడు ‘పుష్ప’.
ఏ సినిమాకి అయినా కథే హీరో. ఎంతపెద్ద తారాగణం ఉన్నా కూడా సరైన కథ లేకపోతే ఎంతమంది దర్శకధీరులు వచ్చినా కూడా చేతులు ఎత్తేయాల్సిందే. కానీ ‘పుష్ప-2’ కథానాయకుడి రూలింగ్‌నే కథగా మలిచారు సుకుమార్. ఇక కథ లోకి వస్తే.. పార్ట్ 1 కి కొనసాగింపు గానే ‘పెళ్లం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటదో పపంచానికి చూపిస్తా’ అని పుష్ప ట్రైలర్‌లో చెప్పింది కేవలం డైలాగ్ మాత్రమే కాదు.. అదే అసలు కథ.. పుష్ప ది రూల్ కథకి మూలం. పుష్ప రాజ్(అల్లు అర్జున్)(Allu Arjun) ఎర్ర చందనం సిండికేట్ లో రారాజుగా తన భార్య శ్రీవల్లి(రష్మిక మందన్నా)(Rashmika Mandanna) మాట కోసం ఎంత దూరం అయినా వెళ్లగలిగేలా మారుతాడు. ఇంకో పక్క తన కుటుంబం నుంచి గుర్తింపు కోసం కూడా ఎన్నో అవమానాలు పడినప్పటికీ ఎదురు చూస్తుంటాడు. ఈ క్రమంలో శ్రీవల్లి అడిగిన ఒక చిన్న మాట కోసం తాను ఎంత వరకు వెళ్లి రాజకీయాలు ఎలా శాసించాడు? ఎంత దూరం వెళ్లాడు? పుష్ప ది రూల్ అంటూ రాష్ట్ర సీఎంలను మార్చేసేతంట రూలింగ్ చేసి.. రాజకీయాలను ఏవిధంగా శాసించాడు? పోలీస్ అధికారి భన్వర్ సింగ్ షేకావత్(ఫహాద్ ఫాజిల్) (Fahad Fazil)తో ఢీ కొట్టి.. తన నేర సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించాడు? తన ఇంటిపేరును దక్కించుకోవడం కోసం పడిన తపన ఏంటనేదే పుష్ప ది రూల్ కథ. మరోపక్క పుష్ప ని ఎలాగైనా పట్టుకోవాలని చూస్తున్న భన్వర్ సింగ్ షేకావత్ ఏం చేస్తాడు? పుష్ప కి తను కోరుకున్న ఇంటి పేరు తన అన్న మోహన్(అజయ్) (Ajay)నుంచి ఇప్పటికి అయినా తెచ్చుకోగలిగాడా ఈ క్రమంలో పుష్ప జర్నీ ఎలా సాగింది అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.
నటీనటుల హవబవాలు :
ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సాలిడ్ సీక్వెల్ ఆ అంచనాలు రీచ్ అయ్యే మాసివ్ సీక్వెన్స్ లతో దుమ్ము లేపే హై మూమెంట్స్ తో నిండి ఉందని చెప్పాలి. సినిమా ఆరంభం నుంచే సుకుమార్ తన మార్క్ డిటెయిలింగ్ అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రెజెన్స్ లతో కన్నుల పండుగలా మంచి అడ్రినలిన్ రష్ ఇచ్చే సన్నివేశాలతో నింపేశారు. ముఖ్యంగా పుష్ప రోల్ ని మరింత స్ట్రాంగ్ గా చూపించే సన్నివేశాలు అయితే మాస్ ఆడియెన్స్ కి ఫుల్ గా ఎక్కేస్తాయి అని చెప్పడంలో డౌట్ లేదు. బన్నీ పై ఒకో సీన్ ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్లో సినిమాలో పేలాయి. జాతర సీన్ లో అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ అయితే నభూతో న భవిష్యత్ అనే స్థాయిలో ఉంటుంది. ఆ ఎపిసోడ్ మొత్తంలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపాన్ని చూపించి అత్యద్భుతంగా రక్తి కట్టించాడు. పుష్ప పార్ట్ 1 అల్లు అర్జున్ మ్యానరిజమ్ గురించే అంతా మాటాడుకున్నారు. కానీ ఇందులో అతని మ్యానిరిజమ్ నెక్స్ట్ లెవల్ ఉంది. నోట్లో పాన్ వేసుకుని భుజం పైకి ఎత్తి రాష్ట్ర సీఎంలను సైతం గడగడలాడించే పవర్ ప్యాక్డ్ ఎలివేషన్స్ సీన్లలో బీభత్సమైన హైప్ వచ్చింది. ‘పుష్పగాడు తగ్గాలని చాలామంది ఎదురు చూస్తున్నారులే.. దీనవ్వా తగ్గేదేలే’ లాంటి డైలాగ్‌లతో పాటు వేయాల్సిన వాళ్లకి చాలానే చురకలు వేశాడు అల్లు అర్జున్.
ఈ సినిమా కాస్త అటూ ఇటూ అయితే.. పరిస్థితి ఏంటో అల్లు అర్జున్‌కి బాగా తెలుసు. ఒక నటుడు ప్రాణాలు పెట్టి నటించడమే చూశాం.. కానీ అల్లు అర్జున్ ఈ సినిమాతో ప్రాణాలకు తెగించి నటించాడనే అనిపిస్తుంది. తెగించినోడికి తెడ్డే లింగం అన్నట్టు నట విశ్వరూపం చూపించాడు. పుష్ప 2 ముందు వరకూ అల్లు అర్జున్ నటన ఓ లెక్క.. పుష్ప 2 తరువాత మరో లెక్క అన్నట్టుగా నిజంగానే వైల్డ్ ఫైర్ చూపించారు. ప్రీ క్లైమాక్స్ లో రప్ప రప్పా యాక్షన్ బ్లాక్ కూడా సాలిడ్ ట్రీట్ ఇస్తుంది. ఇందులో కూడా అల్లు అర్జున్ తన విశ్వరూపం చూపించాడు. అలాగే తన యాక్షన్ బ్లాక్ లు మ్యానరిజంలు అయితే తనలోని పర్ఫెక్ట్ నటుడుని చూపిస్తాయి. ఇంకా జాతర సీన్ లో రష్మిక పై సీన్ విజిల్ కొట్టిస్తుంది. ఇంకా నటుడు ఫహాద్ ఫాజిల్ తన ఎంట్రీ సీన్ నుంచి పలు సన్నివేశాలు అందులో తన నటన తన వెర్సటాలిటీ చూపిస్తాయి. ఇక వీరితో పాటుగా సినిమాలో ఉన్న ప్రధాన నటీనటులు వారిపై ఫస్ట్ పార్ట్ కి రెండో పార్ట్ కి కొనసాగింపుగా తీసుకున్న జాగ్రత్తలు, కొత్తరకం స్మగ్లింగ్ ఐడియాలు ఇంప్రెస్ చేస్తాయి. ఇంకా ఐటమ్ సాంగ్ లో కనిపించిన శ్రీలీల ఫుల్ సాంగ్ లో దుమ్ము లేపేసింది. యువ నటుడు తారక్ పొన్నప్ప క్రేజీ రోల్ లో మ్యాడ్ పెర్ఫామెన్స్ అందించాడు, ఇంకా క్లైమాక్స్ లో పుష్ప రోల్ కి ఒక ఎమోషనల్ ముగింపు బాగుంది.
సాంకేతిక వర్గం పనితీరు :
సినిమాలో నిర్మాణ విలువలు భారి లెవల్లో వున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా అవసరం అయ్యిన చోట అంతా ఆ గ్రాండియర్ ఖర్చు కనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా సినిమాలో ఆ వింటేజ్ బ్యాక్ డ్రాప్ డీటెయిల్స్ గాని జాగ్రత్తలు కానీ బాగున్నాయి. ఇంకా సినిమాలో యాక్షన్ బ్లాక్ లు అదిరిపోయాయి. అల్లు అర్జున్ ని ఎలా కావాలంటే అలా వాడుకున్నారు. అందులో బన్నీ తన మార్క్ గెస్చర్స్, మ్యానరిజంలో వాటికి మరింత స్టైలిష్ నెస్ తీస్కుకొచ్చాడు. దేవిశ్రీప్రసాద్ ప్రసాద్ సాలిడ్ మ్యూజిక్ థియేటర్లులో ఇంకా బాగుంది. అలాగే జాతర సాంగ్ స్పెషల్ అట్రాక్షన్. నేపథ్య సంగీతాలు కూడా బాగున్నాయి. ఇక దర్శకుడు సుకుమార్ విషయానికి వస్తే.. సినిమా ఆరంభం నుంచే సుకుమార్ తన మార్క్ డిటెయిలింగ్ అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రెజెన్స్ లతో కన్నుల పండుగలా మంచి అడ్రినలిన్ రష్ ఇచ్చే సన్నివేశాలతో నింపేశారు. తన మార్క్ డీటైలింగ్ గాని అల్లు అర్జున్ సహా ఇతర పాత్రలని ఆవిష్కరించిన విధానం ముఖ్యంగా ఎమోషన్స్ ని వాటికి జస్టిఫికేషన్ ఇచ్చి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ని తను అందిస్తారు. అయితే కథలో మరీ అంత బలమైన పాయింట్ ఉన్నట్టు అనిపించదు, ముగింపు కూడా ఇంకా బెటర్ గా ఇచ్చి ఉంటే బాగుణ్ణు కానీ ఉన్నంతలో మాత్రం అదరగొట్టేసారు.
విశ్లేషణ :
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “పుష్ప 2 ది రూల్” టైటిల్ కి తగ్గట్టు గానే ఒక ఫుల్ పైసా వసూల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. బాక్సాఫీస్ లెక్కలు ఎక్కడ ఆగుతాయో కానీ సినిమా మాత్రం అంచనాలు రీచ్ అయ్యే విధంగా మాంచి ట్రీట్ ఇస్తుంది. అక్కడక్కడా కొన్ని బలహీనతలు ఉన్నాయి కానీ అల్లు అర్జున్ పీక్ పెర్ఫామెన్స్ తనపై ఎలివేషన్స్, తనపై ఎమోషన్స్ ప్రతీ ఒక్కటీ డెఫినెట్ గా ఆడియెన్స్ తో ఎగ్జైట్ అయ్యేలా చేస్తాయి, నవ్విస్తాయి, ఎమోషనల్ అయ్యేలా కూడా చేస్తాయి. ఈ విషయంలో దర్శకుడు సుకుమార్ సూపర్ సక్సెస్ అయ్యారు. వీటితో పుష్ప పార్ట్ 2 వరకు ఆడియెన్స్ కి అసలు నిడివితో సంబంధమే లేకుండా మళ్లీ మాసివ్ ట్రీట్ ని అంతకు మించే అందిస్తుంది. సో థియేటర్స్ లో 100 పెర్సెంట్ ఎంజాయ్ చేసేవిధంగా సినిమా వుంది.