Minister Damodar: అలాంటి వారికి సరైన సమయంలో.. ప్రజలే మరోసారి : మంత్రి రాజనర్సింహ

బస్తీ దవాఖానాలపై రాజకీయ లబ్ధి కోసమే కొందరు ప్రజాప్రతినిధులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Rajanarsimha) ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్ రావు(Harish Rao) , కేటీఆర్ (KTR) బస్తీ దవాఖానాలను సందర్శించి వసతులు, ఔషధాలు లేవంటూ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ప్రజాప్రతినిధులే తప్పుడు ప్రచారంచేస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల (Government hospitals) పై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లేలా చేయడం దురదృష్టకరమన్నారు. బస్తీ దవాఖానాల ద్వారా 134 రకాల వైద్య పరీక్షలకు ఉచితంగా అందిస్తున్నామని, నిత్యం 45 వేల మందికి సేవలు అందుతున్నాయని చెప్పారు. అన్ని చోట్ల వైద్యులతో పాటు మందులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు లబ్ధి చేకూర్చేలా కొందరు ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అలాంటి వారికి సరైన సమయంలో ప్రజలే మరోసారి గుణపాఠం చెబుతారన్నారు.