Praveen Kandregula: డైరెక్టర్ కు అంత నమ్మకమేంటి?
తాము తీసిన సినిమా ఎలా ఉన్నా సరే తమకు అది గొప్ప సినిమానే అవుతుంది. దానిక్కారణం సినిమాపై వారు పెట్టుకున్న నమ్మకం. అలాంటి సినిమా గురించి బావుంటేనే మా సినిమా చూడండి లేకపోతే వద్దు అని చెప్పే సాహసాలు ఎవరూ పెద్దగా చేయరు. ఎందుకంటే అలా చెప్పాక ఒకవేళ సినిమా ఎక్కడైనా తేడా కొడితే నానా ట్రోలింగ్ ఎదురవుతుంది కాబట్టి.
ఇవన్నీ తెలిసి కూడా డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల(praveen kandregula) తాను తీసిన పరదా సినిమా గురించి ఈ వ్యాఖ్యలు చేశాడు. అనుపమ పరమేశ్వరన్(anupama parameswaran) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆగస్ట్ 22న రిలీజ్ కానుండగా ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ శనివారం ట్రైలర్ ను లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ ప్రవీణ్ పరదా సినిమాపై ఉన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.
సినిమాను ఎంతో కష్టపడి చేశామని, ఇదొక మంచి కమర్షియల్ సినిమా అవుతుందని, పరదా కోసం ఆడియన్స్ ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయకుండా టికెట్ కొని థియేటర్లలో మాత్రమే చూడాలని కోరారు. ఈ సినిమా తప్పకుండా ఆడియన్స్ ను నచ్చుతుందని, కావాలంటే సినిమా రిలీజై రివ్యూలు వచ్చాక బావుంటేనే సినిమాకు వెళ్లమని కూడా చెప్పడం చూస్తుంటే డైరెక్టర్ కు సినిమా పై ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటో అర్థమవుతుంది. మరి ఈ సినిమా డైరెక్టర్ నమ్మకాన్ని ఏ మేరకు నిలబెడుతుందో చూడాలి.







