Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ విడుదల

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘ఫంకీ’ (Funky). ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది. అనుదీప్ దర్శకత్వంలో వినోదం ఏ స్థాయిలో ఉంటుందో తెలిపేలా ‘ఫంకీ’ టీజర్ ఎంతో హాస్యభరితంగా, ఓ విందు భోజనంలా ఉంది.
ఈ చిత్రంలో విశ్వక్ సేన్ దర్శకుడి పాత్రను పోషిస్తుండటం విశేషం. ఇందులో విశ్వక్ సరికొత్తగా కనిపిస్తున్నారు. కథానాయిక కయాదు లోహర్ తన అందంతో కట్టిపడేశారు. వీరి జోడి కొత్తగా, ఉత్సాహంగా కనిపిస్తూ.. తెరకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. టీజర్ లో భీమ్స్ సిసిరోలియో సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తనదైన నేపథ్య సంగీతంతో ప్రతి షాట్‌ను మరో స్థాయికి తీసుకెళ్ళారు. మొత్తానికి టీజర్ మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేలా ఉండటమే కాకుండా, సినిమా పట్ల ప్రేక్షకుల ఆసక్తిని రెట్టింపు చేస్తోంది.
దర్శకుడు అనుదీప్ శైలి ప్రత్యేక వినోదం టీజర్ లో అడుగడుగునా కనిపించింది. ఈసారి ఆయన రెట్టింపు వినోదాన్ని అందించబోతున్నారని స్పష్టంగా తెలుస్తుంది. అనుదీప్ దర్శకత్వం వహించిన ‘జాతిరత్నాలు’ ఏ స్థాయిలో నవ్వులను పంచిందో తెలిసిందే. ఇప్పుడు అంతకుమించిన స్థాయిలో నవ్వులను పంచి, ప్రేక్షకులకు సరికొత్త వినోద విందుని అందించేలా దర్శకుడు అనుదీప్ ‘ఫంకీ’ చిత్రాన్ని మలుస్తున్నారు.
నవీన్ నూలి ఎడిటింగ్ కథనం యొక్క వేగాన్ని పదునుగా, ఆకర్షణీయంగా ఉంచుతుందని హామీ ఇస్తుంది. అలాగే రచయితలు అనుదీప్ కె.వి., మోహన్ సాటోల చమత్కారమైన రచన.. హాస్యం యొక్క మరొక పొరను జోడిస్తుంది. సురేష్ సారంగం కెమెరా పనితనం ‘ఫంకీ’ టీజర్ ని మరింత అందంగా మలిచింది. చిత్ర కథకి తగ్గట్టుగా ప్రతి ఫ్రేమ్ అందంగా కనిపిస్తూ, విజువల్ గా అద్భుతంగా ఉంది.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాణ సంస్థల నుంచి వస్తున్న సినిమా కావడంతో, ‘ఫంకీ’పై సహజంగానే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా టీజర్ ఉంది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.
మొత్తం మీద ‘ఫంకీ’ టీజర్ ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకునే ఓ వినోదభరిత చిత్రానికి హామీ ఇస్తుంది. ఉత్సాహభరితమైన ప్రధాన జంట, విచిత్రమైన పాత్రలు మరియు అద్భుతమైన సాంకేతిక బృందం మద్దతుతో ‘ఫంకీ’ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రంగా రూపుదిద్దుకుంటోంది.