Chiranjeevi: సంచలనం.. ఆ డైరెక్టర్‌తో సినిమా కోసం ఇంటి ముందు నిల్చున్న చిరు!
టాలీవుడ్ సీనియర్ నటుడు భానుచందర్ తన సినీ ప్రస్థానంలోని ఆరంభ కాలపు జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో తనకున్న అనుబంధం, అవకాశాల కోసం తాము పడిన కష్టాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకుంటూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
అవకాశాల కోసం ఎదురుచూపులు
భానుచందర్ తండ్రి సినీ పరిశ్రమకు చెందిన వారే అయినప్పటికీ, తన సొంత కష్టంతోనే పైకి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చిరంజీవి, సుధాకర్ వంటి వారితో కలిసి శిక్షణ పొందారు. ఆ సమయంలో ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ ఆఫీసు గేటు వద్ద అవకాశాల కోసం చిరంజీవి, తాను గంటల తరబడి వేచి చూసేవారమని భానుచందర్ గుర్తు చేసుకున్నారు. తన తొలి చిత్రం ‘నాలాగే ఎందరో'(1978) అయినప్పటికీ, ‘మన ఊరి పాండవులు’ చిత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందని ఆయన తెలిపారు.

నిరీక్షణ – కెరీర్ మలుపు
దర్శకుడు బాల మహేంద్రతో తన స్నేహం ఎలా మొదలైందో వివరిస్తూ.. షూటింగ్ గ్యాప్‌లో తాను, చిరంజీవి కలిసి చేసిన కరాటే విన్యాసాలు చూసి బాల మహేంద్ర ముగ్ధులయ్యారని చెప్పారు. ఆ తర్వాత వచ్చిన ‘నిరీక్షణ’ చిత్రం భానుచందర్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ సినిమాలో ఒక సన్నివేశం కోసం పాత్రలో సహజత్వం దెబ్బతినకుండా ఉండేందుకు తాను నూలుపోగు లేకుండా నటించానని, అలాగే నటి అర్చన కూడా గిరిజన యువతి పాత్ర కోసం ఎంతో సాహసోపేతంగా నటించారని ఆయన చెప్పుకొచ్చారు. గిరిజన మహిళల జీవనశైలిని ప్రతిబింబించేలా బాల మహేంద్ర ఆ చిత్రాన్ని ఎంతో కళాత్మకంగా తీశారని, అందులో అశ్లీలతకు తావులేదని ఆయన స్పష్టం చేశారు.






