లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి విజయ పధంలో నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానం

అలనాటి నటీమణుల్లో భానుమతి, సావిత్రి, వాణిశ్రీ ల తరువాత తెలుగు సినిమా పరిశ్రమలో హీరోతో సమానమైన స్టార్ స్టేటస్ పొందిన హీరోయిన్ విజయశాంతి మాత్రమే. హీరోలతో డ్యూయెట్లు మాత్రమే కాదు.. వీరోచితమైన పాత్రలెన్నో చేసారు విజయిశాంతి. ఆమె సినీ కెరీర్ కు నేటితో 40 ఏళ్లు పూర్తయ్యాయి. సూపర్ స్టార్ కృష్ణతో ‘కిలాడీ కృష్ణుడు’ సినిమాలో ఆమె హీరోయిన్ గా తొలిసారి తెరపై కనిపించారు. విజయనిర్మల దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా 1980 సెప్టెంబర్ 12న విడుదలైంది. అప్పటినుంచి మొదలైన ఆమె సినీ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగింది.గ్లామర్ గా డ్యూయెట్లకు మాత్రమే పరిమితం కాకుండా సమాజంపై ప్రభావం చూపే పాత్రలను ఆమె కెరీర్ పీక్స్ లో ఉండగానే నటించారు. ప్రతిఘటన, రేపటి పౌరులు, భారతనారి, కర్తవ్యం, ఒసేయ్.. రాములమ్మ.. వంటి సినిమాల్లో ఆమె నటనా ప్రావీణ్యం కనపడుతుంది. ప్రతిఘటన సినిమాతో ఆమె తెలుగునాట సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కర్తవ్యం సినిమాకు జాతీయ స్థాయి ఉత్తమనటి అవార్డు దక్కించుకున్నారు. లేడీ పోలీస్ ఆఫీసర్ గా తర్వాత ఎందరో చేసిన సినిమాలకు మార్గదర్శకురాలిగా నిలిచారు. ఒసేయ్.. రాములమ్మతో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్లు రాబడుతుందా అని ఆశ్చర్యపోయేలా చేశారు.
చిరంజీవితో విజయశాంతి అత్యధికంగా 19 సినిమాల్లో నటించారు. తమిళ్ లో రజినీకాంత్, హిందీలో అమితాబ్ బచ్చన్ తో కూడా నటించారు. ఇండస్ట్రీలోని ఆమె జనరేషన్లోని టాప్ హీరోలందరితో నటించారు. తరం మారిన తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించారు. కర్తవ్యం సినిమాతో లేడీ అమితాబ్ అనే పేరు పొందారు. 2006లో నాయుడమ్మ సినిమా తర్వాత గ్యాప్ తీసుకుని 2020లో మహేశ్ తో సరిలేరు నీకెవ్వరుతో మళ్లీ మేకప్ వేసుకున్నారు. 40 ఏళ్ల ఆమె సినీ ప్రస్థానంపై ట్విట్టర్లో స్పందించారు. తొలి అవకాశం ఇచ్చిన విజయనిర్మలకు.. ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రల్లో ఎక్కువగా నటించిన విజయశాంతి క్రమంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. హీరోతో సమానంగా పారితోషికం తీసుకున్న ఏకైక హీరోయిన్. ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు సహా ఆ తర్వాత అగ్ర కథానాయకులైన చిరంజీవితో, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునతో కలిసి నటించిన అతి తక్కువ మంది హీరోయిన్లలో విజయశాంతి ఒకరు. అత్యధిక కథానాయిక ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించిన లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి.
సూపర్‌స్టార్ కృష్ణతో తొలి తెలుగు చిత్రం
ప్రముఖ దర్శకుడు భారతీరాజా తెరకెక్కించిన కన్నుక్కుల్ ఈరమ్ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన విజయశాంతి వెంటనే తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టారు. గిన్నిస్‌బుక్ రికార్డ్ హ్డోర్ విజయ నిర్మల తెరకెక్కించిన కిలాడీ కృష్ణుడు సినిమాలో సూపర్‌స్టార్ కృష్ణతో కలిసి నటించారు.
నాన్‌స్టాప్ జర్నీ వరుస సినిమాలు
విజయశాంతి నటన, గ్లామర్‌తో అతి తక్కువ కాలంలోనే వరుస సినిమాల్లో నటించే అవకాశాలను దక్కించుకున్నారు. 1981లో ఎనిమిది తమిళ సినిమాలు , మూడు తెలుగు సినిమాలు చేశారు విజయశాంతి. అలాగే 1982లో ఐదు తెలుగు సినిమాలు, నాలుగు తమిళ సినిమాలు చేశారు. 83లో నాలుగు తమిళ సినిమాులు చేశారు. కేరళ హెన్ను, సింహ గర్జనె వంటి కన్నడ సినిమాలు కూడా చేశారు. వీటికి తోడు పండంటికాపురానికి పన్నెండు సూత్రాలు, ధర్మాత్ముడు, పెళ్లి చేసి చూపిస్తాం, అమాయక చక్రవర్తి, సంఘర్షణ, ముక్కుపుడక, నవోదయం, రాకాసి లోయ, పెళ్లి చూపులు వంటి 9 సినిమాల్లో నటించి మెప్పించారు. అలా నాలుగేళ్లలో దాదాపు 40 సినిమాలు చేశారు.
మలుపు తిప్పిన నేటిభారతం
గ్లామర్ పాత్రలకే పరిమితమైన విజయశాంతి కెరీర్‌ను మలుపు తిప్పిన దర్శకుడు టి.కృష్ణ. ఈతరం ఫిల్మ్ బ్యానర్‌పై నేటి భారతం సినిమాలో హీరోయిన్‌గా విజయశాంతిని తీసుకున్నారు. విప్లవాత్మకమైన కథ కాబట్టి, అప్పటిదాకా గ్లామర్ పాత్రుచేస్తున్న ఈమెను ఎందుకు ఎంపిక చేశారని చాలా మంది టి.కృష్ణను అడిగారు. కానీ ఆయన విజయశాంతి మీద నమ్మకంతో షూటింగ్ మొదలు పెట్టేశారు. తన నమ్మకాన్ని విజయశాంతి వమ్ము చేయలేదు. డైరెక్టర్ ఆ పాత్రను ఎలా చేయానుకున్నారో అలా అద్భుతమైన నటనతో పాత్రకు ప్రాణం పోశారు. ఒకవైపు గ్లామర్ పాత్రలు, మరోవైపు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేసి అందరితో మెప్పు పొందారు. వందేమాతరం, దేశంలో దొంగుపడ్డారు.. వంటి సినిమాలు ఆమె చాలా బాగా నటించారు. అగ్నిపర్వతం, పట్టాభిషేకం, దర్జా దొంగ, వంటి రెబల్ పాత్రల్లోనూ, హీరోతో ఆడిపాడే హీరోయిన్‌గానూ ఆమె అనతికాంలోనే నిరూపించుకున్నారు. టి కృష్ణ దర్శకత్వం లో 1985 లో ఉష కిరణ్ మూవీస్ బ్యానర్ లో వచ్చిన ‘ప్రతిఘటన’ చిత్రం సెన్సషనల్ హిట్ అయ్యింది. ఆ సినిమా స్ఫూర్తి తో అప్పటివరకు సాదాసీదాగా వున్న సినిమా కథలు డైనమిక్ గా రాయడం మొదలుపెట్టారు.
తెలుగు చిత్రాలకే ప్రాముఖ్యత
1986 నుంచి దాదాపుగా తమిళంలో మానేసి తెలుగుకె పరిమితమయ్యారు. 1986లో రేపటి పౌరులు ,అరుణకిరణం, సమాజంలో స్త్రీ, శ్రావణసంధ్య వంటి సినిమాల్లో నటకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తే.. మరోవైపు ముద్దు కృష్ణయ్య, దేశోద్ధారకుడు, కొండవీటి రాజా, ధైర్యవంతుడు, చక్కనోడు వంటి కమర్షియల్ సినిమాల్లోనూ నటించారు. పడమటి సంధ్యా రాగం, స్వయంకృషి. భారతనారి, శత్రువు, ముద్దాయి, నాగాస్త్రం, కొడుకు దిద్దిన కాపురం… హిందీలో ఈశ్వర్ ! జానకి రాముడు…ఆ తర్వాత ఐదేళ్లలో యముడికి మొగుడు, ఇంద్రుడు చంద్రుడు, మువ్వగోపాలుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, గూండారాజ్యం వంటి విజయవంతమైన చిత్రాల్లోనూ నటించారు. భార్గవరాముడు, సాహస సామ్రాట్, ఇన్‌స్పెక్టర్ ప్రతాప్, మంచిదొంగ, యుద్ధభూమి వంటి హిట్ చిత్రాలతో మెప్పించారు విజయశాంతి.
కర్తవ్యంతో బిగ్గెస్ట్ బ్రేక్
1990 జూన్ లో వచ్చిన కర్తవ్యం విజయశాంతి నట జీవితాన్ని మరో మలుపు తిప్పింది. కర్తవ్యం సినిమాలో రెమ్యూనిరేషన్ ఒక కోటి రూపాయలు ఆ కాలంలో ఏ కథానాయికలు పొందని అత్యంత ఎక్కువ రెమ్యూనిరేషన్ ఐపీయస్ అధికారిణి కిరణ్‌బేడీ స్ఫూర్తితో మోహన్ గాంధి డైరక్షన్‌లో అప్పటివరకు విజయశాంతి మేకప్ మాన్ వున్నా ఏ ఎం రత్నం సూర్య మూవీస్ అనే బ్యానర్ పెట్టి విజయశాంతి కథానాయకిగా నిర్మించిన ఈ చిత్రం అపూర్వ విజయం సాధించింది. ఆమెకు నంది అవార్డు, నేషనల్ అవార్డును తెచ్చిపెట్టింది. వైజయంతీ పాత్రలో ఆమె చూపిన అభినయం, రిస్కుకు భయపడకుండా చేసిన యాక్షన్ పార్టు లేడీ అమితాబ్, యాంగ్రీ యంగ్ విమెన్, ఫైర్‌బ్రాండ్‌లాంటి బిరుదును సంపాదించిన పెట్టిన సినిమా కర్తవ్యం. ఈ సినిమా తర్వాత అగ్ర కథానాయకులైన చిరంజీవి, నాగార్జున, బాకృష్ణ, వెంకటేష్‌తో వరుస సినిమాు చేస్తూ వచ్చారు. తొలిసారి ఒక కథానాయికను సూపర్‌స్టార్ బిరుదుతో తెలుగు సినిమా పత్రికలూ పొగిడాయి. కర్తవ్యం చిత్రం తమిళంలోకి వైజయంతీ ఐపీయస్‌గా అనువాదమై తమిళ సూపర్‌స్టార్ బిరుదును కూడా ఆమెకు కట్టబెట్టాయి. 1991 – 95 మధ్య కాలంలో ఆమె ఇతర స్టార్ హీరో సరసన నటించిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ కాలం లో విజయశాంతి కర్తవ్యం చిత్రాన్ని తేజస్విని పేరుతో స్వయంగా హిందీలో నిర్మించి తెలుగులో తను పోషించిన వైజయంతి పాత్రను అక్కడ కూడా పోషించింది. 1994లో హిందీలో విడుదలై బాలీవుడ్‌లోనూ మంచి హిట్ అయ్యింది. 1992లో ఆమె నటించిన తమిళ సినిమా మణ్ణన్ మంచి విజయాన్ని దక్కించుకుంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత రజినీకాంత్‌తో విజయశాంతి నటించిన స్ట్రెయిట్ తమిళ సినిమా ఇది.
ఒసేయ్ రాములమ్మతో మరో సారి ప్రభంజనం
విజయశాంతి టైటిల్ పాత్రలో దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ఒసేయ్ రాములమ్మ సూపర్‌డూపర్‌హిట్ అయ్యింది. అదే ఏడాది విడుదలై సూపర్ హిట్ అయిన భారీ సినిమాలకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ కలెక్షన్లు రాబట్టి… బాక్సాఫీస్ దగ్గర విజయశాంతి హవా ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. ఈ సినిమాతో నాలుగో నంది దక్కించుకుంది ఏపీ ప్రభుత్వం ఆమెకు ఉత్తమ నటి అవార్డు ఇచ్చింది. ఆ సినిమాలో విజయశాంతి పోషించిన రాముల మ్మ పాత్ర ఎంతటి ప్రజాదరణ పొందిందంటే… తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమం లో ఆమె ఎక్కడికి వెళ్లినా తెలంగాణ ప్రజలు అప్పటి నుంచీ అందరూ ఆమెను రాములమ్మ అనే ముద్దుగా పిలుచు కుంటున్నారు.
అగ్ర హీరోలు – అగ్ర దర్శకులు
చిరంజీవితో 19, బాలయ్యతో 17, సూపర్ స్టార్ కృష్ణతో 12, శోభన్‌బాబుతో 11, సుమన్ తో 7 సినిమాలు చేశారు. స్వర్గీయ టి.కృష్ణ ఆరు సినిమాల్లోనూ ఆమె చేశారు. అలాగే విజయశాంతి నటించిన ఎక్కువ చిత్రాలకు దర్శకుడు కోడి రామకృష్ణ 12 సినిమాలు. కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావుతో తలా పది సినిమాలు, బి.గోపాల్ తో ఏడు సినిమాలు, దాసరితో ఆరు, విశ్వనాథ్, బాపులతో రెండేసి సినిమాలు చేశారు.
రాజకీయాల్లో తనదైన ముద్ర
తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమం లో కె సి ఆర్ తో కలిసి రాష్ట్ర సాధనకు పోరాటం చేసారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందారు. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ విజయశాంతి తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ లో యాక్టివ్ క్యాంపెయినర్‌గా ఉన్నారు విజయశాంతి. శివాని, శాంభవి ఐ.పి.యస్., వైజయంతి, నాయుడమ్మ, ఇందిరమ్మ వంటి చిత్రాలు ఎప్పుడు విడుదలయ్యాయో కూడా తెలియకుండా ఇలా వచ్చి అలా వెళ్లాయి. ఇవన్నీ ఆమె ప్రధాన పాత్రలో నటించినవే అయినా, కథ, కథనాల్లో ఎటువంటి ప్రత్యేకత లేని చిత్రాలు కావటంతో ఎవరినీ ఆకట్టుకోలేకపోయాయి. దానికి తోడు అదే సమయంలో ఆమె రాజకీయరంగంలో కూడా కాలు పెట్టి ఉండటంతో సినిమారంగానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వలేకపోయింది. సినిమాలలో ఉండగలిగే ప్రతిభ, మరింత కాలం కొనసాగటానికి సరిపడినంత వయసు ఉన్నప్పటికీ రాజకీయరంగంపై ఆసక్తితో ఆమె సినిమాలపైనుండి దృష్టి మళ్లించినట్లు అనిపిస్తుంది. కారణాలేవయినప్పటికీ కొంతకాలం తెలుగు వెండితెరకు ఒక అద్భుత నటి దూరమయింది.
సరిలేరు నీకెవ్వరుతో రీ ఎంట్రీ
సూపర్‌స్టార్ మహేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ప్రొఫెసర్ భారతి అనే పవర్‌ఫుల్ పాత్రలో నటించడం ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు విజయశాంతి. వ్యక్తిగతంగా, సినిమా పరంగా, రాజకీయంగా తనదైన శైలిలో రాణిస్తున్న లేడీ సూపర్‌స్టార్ నట విశ్వభారతి విజయశాంతి తెలుగు సినీ రంగంలోకి ఎంటర్ అయ్యి నేటికీ 40 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలను అందజేస్తోంది తెలుగు టైమ్స్.నెట్.
— VijayashanthiOfficial (@vijayashanthi_m) September 12, 2020