Thug life: అనుకున్న టైం కంటే ముందే ఓటీటీ లోకి కమల్ మూవీ.. అసలు రీసన్ అదే..

కమల్ హాసన్ (Kamal Haasan) ఎంతో విశ్వాసంతో తెరపైకి తెచ్చిన తాజా చిత్రం “థగ్ లైఫ్” (Thug Life) అంచనాలను తలకిందులు చేస్తూ, అనుకోని పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఔట్‌రైట్‌గా సినిమా హక్కులను అమ్మకుండా, డిస్ట్రిబ్యూటర్ల (distributors) నుంచి అడ్వాన్స్ తీసుకుని సినిమా విడుదల చేయడం ద్వారా కమల్ సినిమా మీద ఉన్న నమ్మకాన్ని చాటారు. సినిమా థియేటర్లలో ఎక్కువ రోజులు నడవాలని కోరుకుంటూ, ప్రముఖ ఓటీటీ (OTT) సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) తో ఎనిమిది వారాల ఎక్స్క్లూజివ్ థియేట్రికల్ విండో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని కమల్ హాసన్ స్వయంగా ప్రమోషన్‌లో ప్రస్తావించడం చూసినవారు సినిమా పై ఆశాభావంతో ఉన్నారు.
అయితే, విడుదలైన కొన్ని రోజుల్లోనే సినిమాకు ఎదురుదెబ్బలు తగలడం సినిమా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొదట కనిపించిన ఆసక్తిని నిలబెట్టుకోలేకపోయిన ఈ చిత్రం, కలెక్షన్ల పరంగా వెనుకపడిపోయింది. దీంతో బిజినెస్ సర్కిల్స్‌లో కలకలం రేగింది. సినిమా ఫలితం నిరాశ కలిగించడంతో, ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ, మేకర్స్ ఓటీటీ విడుదలపై మళ్లీ ఆలోచనలో పడ్డారని సమాచారం. ఇప్పటి వరకు వచ్చిన సమాచారాల ప్రకారం, మొదట కుదుర్చుకున్న ఎనిమిది వారాల గ్యాప్‌ను తగ్గించి, సినిమా విడుదలైన నాలుగు వారాల్లోనే దక్షిణ భారత భాషల్లో అయినా ఓటీటీలోకి తీసుకురావాలని చర్చలు సాగుతున్నాయని తెలుస్తోంది.
ఈ పరిణామం సినిమాల విజయాన్ని ముందే ఊహించడం ఎంత కష్టమో మరోసారి రుజువుచేస్తోంది. ఎంతటి స్టార్ హీరో , ఎంతటి ప్రణాళికలతో తెరకెక్కించిన సినిమా అయినా ప్రేక్షకుల మద్దతే అసలు ఆధారం. కమల్ హాసన్‌కు ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బగా మారుతుందని భావిస్తున్నారు. అభిమానులు మాత్రం ఓటీటీ విడుదల తేదీపై అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, ముందుగా అనుకున్న విధంగా థియేటర్లలో ఎక్కువకాలం నడిపే ప్రణాళికలు మారిపోవచ్చుననే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. త్వరలోనే ఓటీటీ లోకి థగ్ లైఫ్ వస్తుంది చాలామంది థియేటర్ కి వెళ్లాల్సిన అవసరం ఏమిటి అనుకుంటే..సినిమా కలెక్షన్స్ పై కూడా ప్రభావం చూపి అవకాశం గట్టిగా ఉంది.