Tollywood: రేపు అమరావతికి సినీ ప్రముఖులు.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో (Amaravati) రేపు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుతో (CM Chandrababu) తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా పాల్గొననున్నారు. తెలుగు సినీ పరిశ్రమ (Telugu Cinema) ఎదుర్కొంటున్న సమస్యలు, థియేటర్ల బంద్ వివాదం, రాష్ట్రంలో చిత్రీకరణ సౌకర్యాలు, టికెట్ ధరలు, నంది అవార్డుల (Nandi awards) పునరుద్ధరణ వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీకి ముందు సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్‌ను కలిసి, ఆ తర్వాత ఆయన ఆధ్వర్యంలో చంద్రబాబు నివాసానికి వెళ్లనున్నారు.
గత ఏడాది జూన్‌లో ఎన్డీఏ కూటమి (NDA govt) ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలవలేదని పవన్ కళ్యాణ్ ఇటీవల విమర్శించారు. ఈ విషయంపై ఆయన తీవ్రంగా స్పందించారు. సినీ పరిశ్రమలో కనీస గౌరవం, కృతజ్ఞత లోపించిందని.. ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకుండా సినీ ప్రముఖులు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా, జూన్ 1న థియేటర్ల బంద్ (Theatres Bundh) ప్రతిపాదన, పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు (HariHara VeeraMallu) చిత్రం విడుదలను అడ్డుకునేందుకు జరిగిన కుట్రగా ఆరోపణలు రావడం ఈ వివాదాన్ని మరింత రెచ్చగొట్టింది.
ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ ప్రతినిధులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చంద్రబాబుతో సమావేశం కావడం ఆసక్తి రేపుతోంది. ఈ సమావేశంలో దాదాపు 30 మంది సినీ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు, థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు పాల్గొననున్నారు. రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లు గడిచినప్పటికీ, తెలుగు సినీ పరిశ్రమ పూర్తిస్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి రాలేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టికెట్ ధరల తగ్గింపు, థియేటర్ నిర్వహణ ఖర్చులు, ఇతర విధానపరమైన సమస్యలు సినీ పరిశ్రమను ఇబ్బందులకు గురిచేశాయి. ఫలితంగా, చాలా సినిమాలు హైదరాబాద్‌లోనే చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కనీసం ఒక్క షెడ్యూల్ కూడా తీయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ భేటీ సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న గ్యాప్‌ను తగ్గించేందుకు కీలకమైన అడుగుగా భావిస్తున్నారు.
టికెట్ ధరల పెంపు, థియేటర్ నిర్వహణ ఖర్చులు, డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన శాతం విధానం, నంది అవార్డుల పునరుద్ధరణ వంటి అంశాలను సినీ పరిశ్రమ ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. అదే సమయంలో, ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఫిల్మ్ స్టూడియోల ఏర్పాటు, స్థానిక షూటింగ్ లొకేషన్ల ప్రమోషన్, టికెట్ ధరల పెంపుకు సంబంధించి షరతులతో కూడిన విధానం వంటి ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఈ భేటీ ఫలితంగా సినీ పరిశ్రమ, ప్రభుత్వం మధ్య సమన్వయం మెరుగుపడి, ఆంధ్రప్రదేశ్‌లో సినిమా రంగ అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం జరిగే అవకాశం ఉంది. ఈ చర్చలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సినీ పరిశ్రమ పాత్రను బలోపేతం చేయడంతో పాటు, స్థానిక ఉపాధి అవకాశాలను పెంచడంలో కీలక పాత్ర పోషించవచ్చు.