HHVM: రఘురామ కామెంట్స్, వీరమల్లుకు దెబ్బ పడుతుందా..?

2024 ఎన్నికల్లో తమ ఓటమికి జనసేన పార్టీని కారణమనేది చాలామంది వైసిపి కార్యకర్తల భావన. తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ కలవకపోతే తాము తిరిగి అధికారంలోకి వచ్చేవారమని చాలామంది వైసిపి కార్యకర్తలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూనే ఉంటారు. అందుకే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) విషయంలో ఎక్కువగా ఆ పార్టీ కార్యకర్తలు విమర్శలు చేయడం కూడా చూస్తూనే ఉన్నాం. తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ కలవకుండా ఉండేందుకు వైసీపీ అధిష్టానం కూడా అప్పట్లో తీవ్రంగా ప్రయత్నాలు చేసి విఫలమైంది.
ఇక 2024లో రెండు పార్టీలు కలిపి బిజెపితో కలిసి అధికారంలోకి రావడంతో వైసీపీ కార్యకర్తలు ఇప్పటికి తమ కోపాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ తొలిసారి విడుదల చేస్తున్న హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu) సినిమాపై తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా హైదరాబాదులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పాల్గొని వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఔరంగజేబుగా పోల్చారు. దీనిని జీర్ణించుకోలేని వైసీపీ కార్యకర్తలు, సాకు దొరకడంతో హరిహర వీరమల్లు సినిమాను బాయ్ కాట్ చేయాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు.
ఈ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని, పవన్ కళ్యాణ్ కెరియర్ లో మరో డిజాస్టర్ అంటూ ఇప్పటినుంచి విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దాదాపు నాలుగేళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయింది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చిత్ర యూనిట్ గట్టిగానే చేస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా తన వంతు ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో రఘురామకృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న వైసీపీ కార్యకర్తలు తమ పవర్ ఏంటో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. దీనికి జనసేన కార్యకర్తలు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు ఘాటుగానే సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.