Singer Mangli: సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీపై పోలీసుల దాడి.. గంజాయి, విదేశీ మద్యం స్వాధీనం!

చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్ లో ప్రముఖ సింగర్ మంగ్లీ (Singer Mangli) బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఈ పార్టీకి అనుమతి లేకపోవడంతో పోలీసులు దాడి చేశారు. గంజాయి (Ganja), విదేశీ మద్యం (foreign Liquor) స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి డ్రగ్ (drugs) పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడం, విదేశీ మద్యం, గంజాయి వినియోగించడం లాంటి ఆరోపణలపై మంగ్లీతో పాటు రిసార్ట్ జనరల్ మేనేజర్ శివరామకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీలో సింగర్ ఇంద్రావతి, దివి, కాసర్ల శ్యామ్, రచ్చ రవి తదితర ప్రముఖులు కూడా ఉన్నట్లు సమాచారం.
జూన్ 10 రాత్రి చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్ లో మంగ్లీ తన బర్త్ డేను (birthday celebrations) స్నేహితులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. అయితే ఈ పార్టీలో అనుమతి లేకుండా విదేశీ మద్యం సరఫరా చేయడంతో పాటు గంజాయి వినియోగించినట్లు పోలీసులకు సమాచారం అందింది. స్థానిక పోలీసులతో కలిసి ఎక్సైజ్ పోలీసులు రిసార్ట్ పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడిలో భారీ మొత్తంలో విదేశీ మద్యం, గంజాయి పట్టుబడ్డాయి. అదే సమయంలో డీజే సౌండ్ సిస్టమ్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పార్టీలో పాల్గొన్న వారిలో దామోదర్ అనే వ్యక్తి గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు. పోలీసులు అతనితో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకుని డ్రగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో పలువురికి గంజాయి వినియోగం పాజిటివ్‌గా తేలింది. ఈ ఘటనతో రిసార్ట్ లో జరిగిన పార్టీ అక్రమంగా నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. అనుమతి లేకుండా విదేశీ మద్యం సరఫరా చేసినందుకు మంగ్లీ, రిసార్ట్ జీఎం శివరామకృష్ణపై ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదైంది.
పార్టీలో సింగర్ ఇంద్రావతి, దివి, ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్, యాంకర్ రచ్చ రవి వంటి పలువురు ప్రముఖులు పార్టీకి హాజరైనట్లు తేలింది. వీళ్లలో కొందరికి డ్రగ్ పరీక్షలు కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ దీనిపై అధికారికంగా పోలీసులు ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. పార్టీలో గంజాయి వినియోగం, అనధికార మద్యం సరఫరా జరిగిన విషయం బయటకు రావడంతో సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది.
మంగ్లీ, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ ఫోక్ సింగర్‌గా గుర్తింపు పొందింది. ఆమె గాయనిగా, నటిగా పలు సినిమాల్లో రాణించింది. టీటీడీ ఎస్వీబీసీ చానల్ మెంబర్ గా పని చేసినట్లు సమాచారం. అలాంటి వ్యక్తి ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఆమె అభిమానులను షాక్‌కు గురిచేసింది. సోషల్ మీడియాలో ఈ ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది. కొందరు మంగ్లీని సమర్థిస్తుండగా, మరికొందరు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.
పోలీసులు ఈ ఘటనపై లోతైన విచారణ జరుపుతున్నారు. రిసార్ట్ లో గంజాయి సరఫరా ఎవరు చేశారు, విదేశీ మద్యం ఎలా అందుబాటులోకి వచ్చింది అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై మంగ్లీ లేదా ఆమె టీం నుంచి ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. పోలీసుల విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.