స్వర్ణోత్సవం జరుపుకుంటున్న పద్మాలయ బ్యానర్ నాకు ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని ఇచ్చింది – సూపర్ స్టార్ కృష్ణ

నాకు పద్మాలయా బ్యానర్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గౌరవాన్ని తెచ్చింది.. అవును! ఓసారి చికాగో వెళ్లినప్పుడు ఓ డాక్టర్‍గారి ఆహ్వానం మేరకు ఆయన్ని వెళ్లి కలిశాను. నేను తెలుగులో పాపులర్ హీరో అని ఆయనకు తెలుసు. దాంతో నన్ను ఎంతో బాగా రిసీవ్ చేసుకున్నారు. నా సినిమాల గురించి బాగా మాట్లాడారు. మాటల మధ్యలో నన్నెలా కాంటాక్ట్ చేయాలని ఆయన అడిగారు. నేను నా విజిటింగ్ కార్డుని ఇచ్చాను. అది చూడగానే ఆయన కళ్లు మెరిశాయి. ‘మీరు పద్మాలయా చైర్మనా?’ అని అడిగారాయన. ‘అవును..పద్మాలయా నా సొంత బ్యానర్’ అని ఆయనకు నేను చెప్పాను. అంత వరకు అభిమానంగా మాట్లాడిన ఆయనకు నేను పద్మాలయా బ్యానర్ చైర్మన్ అని తెలియగానే మరింత ఆసక్తిని కనపరిచారు. పద్మాలయా బ్యానర్‍లో చేసిన హిందీ సినిమాల గురించి నాతో గంటసేపు మాట్లాడారు. ‘మీరు పద్మాలయా బ్యానర్ అధినేత అని తెలియగానే నాకు మరింత రెస్పెక్ట్ పెరిగింది. పద్మాలయా అధినేతను కలవడాన్ని నా జీవితంలో ఓ ఎచీవ్‍మెంట్‍గా భావిస్తున్నాను’ అని ఆ డాక్టర్‍గారు చెబుతుంటే నేను థ్రిల్ అయ్యాను. ఆ సమయంలో పద్మాలయా బ్యానర్‍లో మరింత ప్రేమ పెరిగింది.
పద్మాలయా నేను లేకపోతే నేను లేను
పద్మాలయా అనే నాలుగు అక్షరాలు నా నట జీవితాన్ని నిలబెట్టాయి. ప్రేక్షకుల్లో మరింత ఇమేజ్‍ను పెంచింది. పద్మాలయా నేను లేకపోతే నేను లేను. పద్మాలయా బ్యానర్ 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం నాకెంతో గర్వంగా ఉంది. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా పద్మాలయా బ్యానర్‍కు అభిమానులున్నారు. అది చాలా సందర్భాల్లో నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ బ్యానర్ నాకు ప్రత్యేకమైన గౌరవాన్ని తీసుకొచ్చింది.
1965లో ఆదుర్తి సుబ్బారావు తేనె మనసులు చిత్రంతో హీరోగా పరిచయం చేస్తే.. 1966లో గూఢచారి 116తో నన్ను ఆంధ్ర జేమ్స్బాండ్‍గా ప్రేక్షకులకు మరింత దగ్గర చేశారు. నేను ఈరోజు 365 చిత్రాలు చేయడానికి కారణం వారిద్దరే. జీవితాంతం వారికి రుణపడి ఉంటాను. గూఢచారి 116 తర్వాత ఒకేరోజున 20 సినిమాలకు పైగా సైన్ చేశాను. రోజుకి మూడు షిఫ్ట్ల్ లో పనిచేస్తూ బిజీ బిజీగా ఉండేవాడిని. ఎంత బిజీ అంటే నిద్రపోవడానికి కూడా టైమ్ ఉండేది కాదు. ఓసారి టక్కరిదొంగ చక్కని చుక్క సినిమా షూటింగ్‍ను రాత్రి రెండు గంటల తర్వాత చేస్తుంటే ‘మీరు నిద్రపోండి నిద్రపోయే షాట్స్ కొన్ని తీసుకుంటాం’ అని ఆ షాట్స్ను తీసుకున్న రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. సినిమాలు చేస్తున్నాయి. హిట్స్ అవుతున్నాయి, ప్లాప్ అవుతున్నాయి. చేతిలో ఇరవై సినిమాలుంటున్నాయి. కానీ ఏదో అసంతృప్తి. ఇంకా ఏదో చేయాలని తపన. అప్పుడు నా అభిరుచికి తగినట్టు సినిమాలు నిర్మిస్తే బావుంటుందనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు కార్యరూపమే పద్మాలయా సంస్థ ఆవిర్భావం.
నిజంగా అగ్ని పరీక్షే..
పద్మావతి మా పెద్దమ్మాయి పేరు. ఆ పేరు వచ్చేలా పద్మాలయా స్టూడియో అని పేరు అనుకున్నాం. బాపుగారు ఎమ్‍బ్లమ్ గీస్తే.. ఈశ్వర్‍గారు డిజైన్ చేశారు. తొలిసారిగా మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ చేశాం. ఇదా మీ సభ్యత ఇదా మీ సంస్కృతి అంటూ పాటలు పెట్టాం. కొండపై నిండుగా కొలువున్న కనకదుర్గ నీకు జేజేలంటూ.. భక్తి గీతాన్ని కూడా పెట్టాం. మంచి కథ కానీ.. కృష్ణ సొంత సినిమా ఇలా కాదు ఉండాల్సిందని జనం అన్నారు. తొలి చిత్రం నిర్మాతగా నాకు నిజంగా నాకు అగ్నిపరీక్షే అయ్యింది. ప్లాప్ అయ్యింది. అంత వరకు హీరోగా సంపాదించిదంతా పోయింది. నిరుత్సాహపడకుండా రెండో ప్రయత్నం చేయడానికి రెడీ అయ్యాం. పద్మాలయా బ్యానర్‍కు నా తమ్ముళ్లు హనుమంతరావు, ఆదిశేషగిరిరావు ఇద్దరూ వెన్నెముకగా నిలిచి నాకు అన్నీ విధాల అండ దండగా నిలిచారు. హనుమంతరావు స్క్రిప్ట్ సైడ్, ఎగ్జిక్యూషన్ చూస్తే బంగారి(ఆదిశేషగిరిరావు) ప్లానింగ్, ఫైనాన్స్, రిలీజ్ వ్యవహారాలు చూసేవాడు. అన్నీ పకడ్బందీగా చేయబట్టే బ్యానర్ స్ట్రాంగ్ అయ్యింది. మొదటి సినిమా ప్లాప్ కాగానే రెండో సినిమాగా ఏదైనా కొత్తగా చేయాలని మోసగాళ్లకు మోసగాడు ప్లాన్ చేశాం.
తొలి కౌబాయ్ చిత్రంగా రికార్డ్!!
కౌబాయ్ కథాంశంతో మోసగాళ్లకు మోసగాడు సినిమా అనగానే డిస్ట్రిబ్యూటర్స్ వెనకడుగు వేశారు. ఆ తరహా కథ మనవాళ్లకు కొత్త కాబట్టి చూడరని నిక్కచ్చిగా చెప్పేశారు. అయినా నిర్ణయం మార్చుకోలేదు. అప్పటికే నేను చేసిన కొన్ని యాక్షన్ సినిమాలు హిందీలో, తమిళంలో డబ్ అయ్యి సక్సెస్‍ఫుల్‍గా రన్ అవడం వల్ల తమిళ్ డబ్బింగ్ రైట్స్ కొనడానికి ఓ డిస్ట్రిబ్యూటర్ ముందుకు వచ్చి అడ్వాన్స్ ఇచ్చారు. అది తెలిసి హిందీ డబ్బింగ్ రైట్స్ ను మరో డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నారు. కర్ణాటక రైట్స్ ను మరొకరు కొన్నారు. ఇలా సినిమా స్టార్ట్ కాకముందే బిజినెస్ కావడం ఆరోజుల్లో ఓ రికార్డు. ఆ అడ్వాన్సులతోనే సినిమాను స్టార్ట్ చేశాం. అద్భుతమైన లొకేషన్స్ లో ఎక్కడా రాజీ పడకుండా సినిమా చేశాం. వాహినీ స్టూడియోలో షూటింగ్ చేస్తుంటే చక్రపాణిగారు లొకేషన్‍కు వచ్చి ‘ఏంటీ కృష్ణా! ఈ డ్రెస్సులేంటి? ఈ గొడవేంటి? మన నెటివిటీ కనపడటం లేదు. ఎవరు చూస్తారు?’ అని అన్నారు. ‘కొత్తగా సినిమా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నామండీ’ అని ఆయనతో నేను అన్నాను. సరే! నీ ఇష్టం అన్నట్లుగా ఆయన వెళ్లిపోయారు. సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత చూసినవాళ్లందరూ సూపర్‍హిట్ అన్నారు. మార్నింగ్ షోకే సూపర్‍హిట్ టాక్ వచ్చింది. 47వ చిత్రంగా అగ్నిపరీక్ష విడుదలైతే, 1971 ఆగస్ట్ 27న 60వ చిత్రంగా మోసగాళ్లకు మోసగాడు సినిమా విడుదలైంది. పద్మాలయా బ్యానర్‍కు ఓ గుర్తింపు వచ్చింది. ఈ సినిమా అప్పటి నుండి 20 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం విడుదల కావడం, విడుదలైన ప్రతిసారి హౌస్‍ఫుల్ కావడం జరిగేవి. ఎప్పుడు విడుదలైనా డబ్బులు వచ్చే సినిమాగా మోసగాళ్లకు మోసగాడుకి ఓ రికార్డ్ ఉంది. ఇంగ్లీష్‍లో ట్రెజర్ హంట్, తమిళంలో మోసకారనక్కు మోసక్కారన్, హిందీలో గన్‍ఫైటర్ జానీ పేరుతో విడుదలై అన్నీ భాషల్లో హిట్టయ్యింది. ట్రెజర్ హంట్ చిత్రాన్ని చాలా దేశాల్లో ప్రదర్శించడానికి మేమంతా గర్వంగా ఫీలయ్యాం. తెలుగులో కౌబాయ్ చిత్రం అంటే గుర్తుకు వచ్చేది మోసగాళ్లకు మోసగాడు సినిమానే. ఆ మేకింగ్ వేల్యూస్ గురించి ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు. ఆరున్నర లక్షల రూపాయలతో అప్పట్లో చేసిన ఆ సినిమాను ఈ రోజుల్లో చేయాలంటే కొన్ని వందల కోట్లు అవుతుంది. అయినా ఆ ఎఫెక్ట్ రావాలంటే చాలా కష్టం. మోసగాళ్లకు మోసగాడు సినిమా చూసి అన్న ఎన్టీఆర్‍గారు ఎంతగానో అభినందించారు. ఎంత పెద్ద హిట్ అయినా అది మాస్ సినిమాగానే ముద్ర పడింది.
ఫ్యామిలీ ఆడియెన్స్ కోసమే పండంటి కాపురం!!
పూర్తి కుటుంబ కథా చిత్రం ఒకటి చేస్తే ఓన్లీ యాక్షన్ సినిమాలకే పరిమితం కాకుండా అన్నీ రకాల సినిమాలకు చేయడానికి వీలవుతుందని పండంటి కాపురం ఒకటి ప్లాన్ చేశాం. ప్రభాకర్ రెడ్డిగారు సబ్జెక్ట్ లో నిర్మాణంలో బాగా ఇన్‍వాల్వ్ అయ్యారు. ఎస్వీ రంగారావుగారు, గుమ్మడి, నేను, ప్రభాకర్‍రెడ్డిగారు అన్నదమ్ములుగా చేశాం. హీరోయిన్స్గా టాప్ యాక్టర్స్ జమున, బి.సరోజాదేవీ, దేవిక, విజయ నిర్మలగారు నటించారు. జయసుధకు అది తొలి చిత్రం. కథా బలం ఉంటే సినిమా అన్నీ రికార్డులను అధిగమిస్తుందని చెప్పడానికి నిదర్శనంగా పండంటి కాపురం ఘన విజయాన్ని సాధించింది. గోల్డెన్ జూబ్లీ హిట్ అయ్యింది. ఈ సినిమా శతదినోత్సవం జరిగినప్పుడు అన్న ఎన్టీఆర్‍గారు పద్మాలయా బ్యానర్‍లో సినిమా చేస్తానని స్టేజ్ మీద అనౌన్స్ చేశారు. పండంటి కాపురం ఫ్యామిలీ పిక్చర్స్ లో ఎవర్‍గ్రీన్‍గా ఎప్పటికీ నిలిచిపోయింది.
అభిమాన నటులతో సొంత సినిమా
అన్న ఎన్టీఆర్‍గారికి నేను పెద్ద అభిమానిని. ఆయనతో నా బ్యానర్‍లో సినిమా అంటే కచ్చితంగా సూపర్‍హిట్ చేయాలని ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి భారీ చిత్రంగా దేవుడు చేసిన మనుషులు సినిమా తీశాం. అనుకున్నట్లుగానే సినిమా మల్టీస్టారర్స్ లో ఓ కొత్త చరిత్రను సృష్టించింది. ఈ సినిమాను రీమేక్ చేయాలని చాలా మంది ప్రయత్నించారు కానీ.. ఆ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇప్పుడు చేసేవాళ్లు లేరు. అన్నగారు, ఎస్వీరంగారావుగారు, నేను, విజయనిర్మల, జయలలిత, జగ్గయ్య, కాంతారావు, కాంచన, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య ఇలా ఇండస్ట్రీలో ఉన్నవారందరూ దేవుడు చేసిన మనుషుల్లో నటించారు. ఆ సినిమా చేసే సమయంలో ప్రతి మార్నింగ్ చెన్నై నుండి బెంగుళూరు వెళ్లి షూటింగ్ చేసుకుని మళ్లీ చెన్నై వచ్చి షూటింగ్‍లో పాల్గొనేవాడిని. ఇలా ఈ సినిమా జరిగినన్నీ రోజులు బెంగుళూరు టు చెన్నై వెళ్లి రావాల్సి వచ్చింది. నా డేట్స్ అంతకు ముందే వేరే నిర్మాతలకు ఇవ్వడం వల్ల ఎక్కడ రామారావుగారి డేట్స్ మిస్ అవుతాయోనని నేను బెంగులూరు టు చెన్నై అప్ అండ్ డౌన్ చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ ఈ సినిమాను అందరూ ఇష్టపడతారు. పద్మాలయా బ్యానర్‍లో టక్కర్ పేరుతో దీన్ని రీమేక్ చేస్తే అక్కడ కూడా సినిమా పెద్ద హిట్టయ్యింది.
అల్లూరి సీతారామరాజు నా జీవితంలో మరుపురాని ఘట్టం!!
73వ చిత్రంగా పండంటి కాపురం 90వ చిత్రంగా దేవుడు చేసిన మనుషులు పద్మాలయా బ్యానర్‍లో గొప్ప విజయాన్ని అందిస్తే విజయకృష్ణ బ్యానర్‍లో విజయ నిర్మల చేసిన మీనా సినిమా నన్ను ఫ్యామిలీ ఆడియెన్స్కు దగ్గర చేసింది. ఇక అల్లూరి సీతారామరాజు నిర్మాణం నా జీవితంలో మరుపురాని ఘట్టం. హీరో అయినందుకు అల్లూరి సీతారామరాజు సినిమా చేయడంతో నన్ను జీవితాంతం ప్రేక్షకులు గుర్తుంచుకునేంత గొప్ప సినిమా అయ్యింది. ‘అల్లూరి సీతారామరాజు సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ అయిన డ్యూయెట్స్, ఫైట్స్ ఉండవు. చాలా రిస్క్ అవుతుంది. అందులోనూ సొంత బ్యానర్‍లో ఎందుకంత రిస్క్ తీసుకోవడం..అలాంటి సినిమా ఎందుకు? నీకు అంతగా కోరికగా ఉంటే నీతో సినిమాలు చేస్తున్న ఇతర నిర్మాతలతో ఆ సినిమా చెయ్ సొంతంగా మాత్రం వద్దు’ అని డిస్ట్రిబ్యూటర్స్ నుండి అందరూ నన్ను హెచ్చరించారు. తీయవద్దని బ్రతిమాలారు. అన్న ఎన్టీఆర్‍గారు కూడా ‘ఆ సబ్జెక్ట్ వద్దు బ్రదర్ కురుక్షేత్రం చేయండి.. నేను కృష్ణుడిగా చేస్తాను, మీరు అర్జునుడి చేయండి’ అన్నారు. అయితే అప్పటికే అల్లూరి సీతారామరాజు చేయడానికి నిర్ణయించుకున్నానని, మీరు తీస్తానంటే నేను మానేస్తానని అన్నాను. దానికి ఆయన ‘నేను చేయను, మీరూ చేయొద్దు’ అన్నారు. అయితే నేను అల్లూరి సీతారామరాజు సినిమా తీస్తున్నామని అన్నగారికి చెప్పేసి వచ్చేశాను. ఒక మహా యజ్ఞంలా, ఒక మహా తపస్సులా రేయింబగళ్లు యూనిట్ అంతా శ్రమించారు. ఆ సినిమా అంతా బాగా రావడానికి వారి కృషే కారణం. తొలి స్కోప్ చిత్రంగా అల్లూరి సీతారామరాజు చరిత్రను సృష్టించింది. ఈరోజు అందరూ స్కోప్ చిత్రాలే తీస్తున్నారు. అయితే స్కోప్ సినిమా తీయడం స్టార్ట్ చేసిన ఘనత పద్మాలయదే. అల్లూరి సీతారామరాజు ప్రేక్షకుల్లో ప్రజల్లో నాకు ప్రత్యేకమైన గౌరవాన్ని తీసుకొచ్చింది. అంతకుముందు కంటే నన్ను గౌరవ భావంతో చూడటం నాకు స్పష్టంగా తెలిసేది. ఆ మహనీయుడైన అల్లూరి సీతారామరాజు పాత్ర చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఆ పాత్ర పోషించడంతో నా జన్మ ధన్యమైందనిపించింది. గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్‍ను చాలా గ్రాండ్‍గా చేశాం. తాష్కెంట్ ఫిలిం ఫెస్టివల్‍లో ప్రదర్శింపబడి ప్రశంసలు అంకుందా చిత్రం. అలాగే శీశ్రీగారికి ‘తెలుగువీరలేవరా..’ పాటకు జాతీయ అవార్డు వచ్చింది. ఇక స్టేట్ అవార్డస్ ఎన్నో వచ్చాయి. ఇటు ప్రేక్షకులతో రివార్డులు ప్రభుత్వంతో అవార్డులు అందుకోవడమే కాదు.. జీవితానికి సరిపడే పేరు ప్రఖ్యాతులను ఈ ఒక్క సినిమా తెచ్చి పెట్టింది. నేను చేసిన 365 చిత్రాల్లో అల్లూరి సీతారామరాజు చిత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. కృష్ణ అంటే అల్లూరి సీతారామరాజు అనేలా ప్రజల్లో ఈ సినిమా నాకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది.
ప్లాపుల పర్వాన్ని దాటుకుని పాడిపంటలతో ఘన విజయం!!
అల్లూరిసీతారామరాజు సినిమా చూసిన విజయా చక్రపాణిగారు ‘కృష్ణా నీతో ఇప్పుడు ఎంత మంది నిర్మాతలు సినిమాలు చేస్తున్నారు?’ అని అడిగారు. ‘పద్నాలుగు మంది తీస్తున్నారు’ అని నేను చెప్పాను. ‘అందరూ అయిపోయారు పో’ అన్నారు. దానికి నేను ‘అదేంటండీ! సినిమా మీకు నచ్చలేదా?’ అన్నాను. ‘సినిమా చాలా గొప్పగా ఉంది కృష్ణ.. ఈ పాత్రలో నిన్ను ఇంత గొప్పగా చూసిన జనానికి ఇప్పట్లో నువ్వు చేసే ఏ సినిమా నచ్చదు.. నువ్వు ఏం చేసినా ప్లాప్ అవుతుంది’ అన్నారు. ఆయన అన్నట్లుగానే అల్లూరి సీతారామరాజు తర్వాత పదిహేడు సినిమాలు రిలీజ్ అయితే అందులో నాలుగు సినిమాలు ఎబౌవ్ యావరేజ్‍గా ఆడినా మిగతా సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. ఈ ప్లాపుల బారి నుండి బయటపడటానికి పద్మాలయా బ్యానర్‍లోనే మంచి కథాబలంతో పూర్తి గ్రామీణ వాతావరణంలో పాడిపంటలు సినిమాను ప్లాన్ చేశాం. అది కచ్చితంగా హిట్టై తీరుతుందని చెప్పి మరీ తీశాం. అనుకున్నట్లుగానే 1976 సంక్రాంతికి నా 118వ చిత్రంగా విడుదలైన పాడిపంటలు అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆ విధంగా పద్మాలయా బ్యానరే హీరోగా రీ ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా 360 చిత్రాలు సునాయసంగా చేయగలిగాను. మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, పాడిపంటలు.. ఈ ఐదు చిత్రాలు నా కెరీర్‍ను కొత్త మలుపులు తిప్పాయి. ఈ ఐదు సినిమాలను పద్మాలయా బ్యానర్‍లోనే చేయడం విశేషం.
200వ చిత్రంగా ఈనాడు!!..మరో సాహసం
అల్లూరి సీతారామరాజు చేయడం ఓ సాహసమైతే, దేవదాసు, కురుక్షేత్రం చిత్రాలు చేయడం కూడా సాహసాలే. అయితే వాటన్నింటికీ మించి నా 200వ చిత్రంగా ఈనాడు చేయడం గొప్ప సాహసమని చెప్పాలి. ఓమలయాళ సినిమా రైట్స్ తీసుకుని దాన్ని చిన్న చిత్రంగా మా బ్రదర్స్ పరుచూరి బ్రదర్స్తో కథను నాకు చెప్పించారు. అందులో ఓ ముఖ్య పాత్ర ఉంది కదా! దాన్ని ఎవరు చేస్తున్నారు? అని అడిగితే ఓ ఆర్టిస్ట్ పేరు చెప్పారు. ‘క్యారెక్టర్‍లో మంచి పొటెన్షియల్?ఉంది. నాకు ఆ క్యారెక్టర్?ఎలా ఉంటుందో ఆలోచించండి’ అన్నాను నేను. ‘గ్లామర్ లేదు, హీరోయిన్ లేదు, ఫైట్స్ లేవు.. మీ ఇమేజ్‍కు ఇది కరెక్టా?’ అని పరుచూరి గోపాలకృష్ణగారు అన్నారు. తర్వాత ‘సరే! మీరు చెప్పారు కాబట్టి, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కథను తయారు చేస్తాం’ అని వెళ్లిపోయారు. రెండు రోజుల్లో నాకు ఈనాడు కథను వినిపించారు. కమర్షియల్?హీరోగా సూపర్‍హిట్స్ సాధిస్తున్న తరుణంలో ఈనాడు సినిమా చేయడం రిస్క్ అవుతుందని చాలా మంది అన్నారు. 200వ సినిమా ఇలాంటి డిఫరెంట్?సినిమా అయితే బావుంటుందని చేశాను. గొప్ప పొలిటికల్ మూవీగా సంచలనం సృష్టించింది. ఈనాడు చాలా మంచి పేరు తెచ్చింది. అన్న ఎన్టీఆర్‍గారు, సినిమా చూసి ‘చాలా బావుంది బ్రదర్..నాకు బాగా హెల్ప్ అయ్యింది’ అని అభినందించడం ఇప్పటికీ మరచిపోలేను.
స్వీయ దర్శకత్వంలో రెండు భాషల్లో 70 ఎం.ఎం చిత్రంగా సింహాసనం!!
నేను దర్శకత్వం వహించిన తొలి చిత్రం సింహాసనం. తెలుగులో తొలి 70 ఎం.ఎం. స్టీరియో స్కోపిక్ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. పద్మాలయా బ్యానర్‍లో భారీ సెట్స్ వేసి తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చేసిన సినిమా. అలాగే బప్పీలహరిని తెలుగులో పరిచయం చేసిన సినిమా. దర్శకుడిగా సింహాసనం నాకు చాలా పెద్ద విజయాన్ని అందించింది. ఆ విజయం అందించిన స్ఫూర్తితోనే పద్మాలయా బ్యానర్‍లో అన్నా తమ్ముడు, ముగ్గురుకొడుకులు, కొడుకు దిద్దిన కాపురం, ఇంద్రభవనం, ఇలా ఎన్నో చిత్రాలు చేశాను. ఇదే బ్యానర్‍లో రమేశ్‍బాబును సామ్రాట్?చిత్రంతో పరిచయం చేశాం. మహేశ్, నేను కలిసి వంశీ సినిమా చేశాం. అలాగే మహేశ్?చిన్నప్పుడు నా దర్శకత్వంలో బాలచంద్రుడు సినిమా చేశాం. హిందీలోనూ ఇష్క్ హై తుమ్‍సే సినిమాను డైరెక్ట్ చేశాను.
300వ చిత్రంగా ‘తెలుగు వీర లేవరా’
పద్మాలయా బ్యానర్‍లో నేను హీరోగా నటించిన 300వ చిత్రాన్ని రూపొందించాం. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్‍గారు, ఏయన్నార్‍గారు వచ్చి ఆశీస్సులు అందజేయడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. నేను అభిమానించే ఎన్టీఆర్‍గారు, నా తొలి సినిమా తేనెమనసులుకు నన్ను సెలక్ట్ చేసిన వారిలో ఒకరైన అక్కినేనిగారు కలిసి నా 300వ చిత్రం ప్రారంభోత్సవానికి రావడం ఓ స్వీట్ మొమరీ.
అన్నీ రకాల చిత్రాలు
పద్మాలయా బ్యానర్ ఎప్పుడూ ఒకే రకమైన చిత్రాలు చేయాలని ఫిక్స్ కాకుండా ఎప్పటికప్పుడు కొత్త తరహా చిత్రాలను అందిస్తూ వచ్చింది. పాడిపంటలు తర్వాత పట్నవాసి, ప్రజారాజ్యం, నా పిలుపే ప్రభంజనం, ఎన్‍కౌంటర్, వైభవం, పోలీస్ అల్లుడు, పండంటి సంసారం, మానవుడు దానవుడు వంటి చిత్రాలతో పాటు చిన్నకోడలు, పల్లెటూరి పెళ్లాం, అన్నా చెల్లెలు, పచ్చతోరణం వంటి చిత్రాలను కూడా అందించారు. పద్మాలయా బ్యానర్‍తో పాటు విజయకృష్ణ బ్యానర్‍లో మీనా, కవిత, దేవుడే గెలిచాడు, అంతం కాదిది ఆరంభం, హేమాహేమీలు, సూర్య చంద్ర, సాహసమే నా ఊపిరి, ప్రజల మనిషి, ఎస్ నేనంటే నేనే, రెండు కుటుంబాల కథ, నేరం శిక్షలాంటి సినిమాలు చేశాం. పద్మావతి ఫిలింస్ బ్యానర్‍లో మనుషులు చేసిన దొంగలు, దొంగల దోపిడీ, రామ్ రాబర్ట్ రహీమ్, మహామనిషి, అల్లుడు దిద్దిన కాపురం, శంఖారావం వంటి చిత్రాలను నిర్మించాం. పద్మాలయా, పద్మాలయా అనుబంధ సంస్థల్లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, బెంగాళీ భాషల్లో 108 చిత్రాలకు పైగా నిర్మించాం.
అందరి హీరోలతోనూ పద్మాలయా చిత్రాలు!!
అన్న ఎన్టీఆర్‍గారితో దేవుడు చేసిన మనుషులు తర్వాత కొంత గ్యాప్ వచ్చినా ఓరోజు వాహినీలో నాకు ఎదురయ్యారు. నేను వెళ్లి విష్ చేశాను. రండి బ్రదర్ అని ఆప్యాయంగా రిసీవ్?చేసుకున్న ఆయన ‘మీ అల్లూరి సీతారామరాజు సినిమాను చూడాలనుకుంటున్నాను. మీరు దగ్గరుండి సినిమా చూపించాలి’ అన్నారు. అదే రోజున అన్నగారికి అల్లూరి సీతారామరాజు సినిమాను చూపించాను. సినిమా పూర్తయిన తర్వాత నన్ను గాఢంగా కౌగిలించుకుని ‘చాలా బాగా చేశారు బ్రదర్ ఇంత కంటే ఎవరూ ఏమీ చేయలేరు’ అని అభినందిచండం జీవితంలో మరచిపోలేని ఘట్టం. ఆ తర్వాత అన్నగారితో కలిసి వయ్యారి భామలు వగలమారి భర్తలు సినిమా చేసేటప్పుడు మళ్లీ పద్మాలయాలో మరో సినిమా చేద్దాం బ్రదర్ అన్నారు. అయితే ఆ సినిమా సమయానికి తెలుగుదేశం పార్టీ పెట్టడానికి నిర్ణయించుకోవడంతో మళ్లీ ఆయనతో సినిమా చేసే అవకాశం లేకుండా పోయింది. పార్టీ పెట్టే సమయంలో ఊటీ లొకేషన్‍లో ఓ పక్కకు తీసుకెళ్లి రాజకీయాల్లోకి వెళుతున్నట్లుగా చెప్పారు. నన్ను కూడా ఆహ్వానించారు. అయితే నాకు సినిమా ఫీల్డ్ లో ఉండాలనుందని ఆయనతో చెప్పాను. ‘అన్నగారు మీరు ఎవరు సపోర్ట్ లేకుండా ముఖ్యమంత్రి అవుతారు’ అని ఆరోజు చెప్పాను. ఆ తర్వాత అప్పుడప్పుడు కలుసుకునేవాళ్లం. ఆయన ఎంతో ప్రమాభిమానాలు చూపేవారు. అక్కినేనిగారితో దేవదాసు తర్వాత గ్యాప్?వచ్చినా హేమాహేమీలు చిత్రంలో ఆయన్ని నటించమని అడగటానికి నేను, విజయ నిర్మల వెళ్లాం. అడిగిన వెంటనే ఆయన అంగీకరించారు. హేమాహేమీలు సూపర్‍హిట్ అయ్యింది. ఆ తర్వాత పద్మాలయా బ్యానర్‍లో చేసిన రాజకీయ చదరంగంలో ఇద్దరం కలిసి నటించాం. పాటలు లేకుండా తీసిన విభిన్న చిత్రమది. శోభన్‍బాబుతో కురుక్షేత్రం చేశాం. మరో సినిమాచేయడానికి ప్లాన్ చేసినా సబ్జెక్ట్ సెట్?కాలేదు. కృష్ణంరాజుగారితో పద్మాలయాలో మరణశాసనం చేశాం. కురుక్షేత్రంలో కృష్ణంరాజుగారు నటించినప్పటికీ విడిగా మరణ శాసనం సినిమా చేశాం. మలయాళంలో విజయవంతమైన అవనై సినిమా చూసి అది నాకంటే కృష్ణంరాజుగారికే బావుంటుందనిపించి ఆయనతో మరణశాసనంగా చేశాం. శోభన్‍గారిలాగానే కృష్ణంరాజుగారు కూడా నాకు మంచి స్నేహితుడు. తమిళంలో శివాజీ గణేశన్‍గారితో విశ్వరూపం, త్యాగి, రజినీకాంత్‍గారితో మావీరన్ సినిమాలను పద్మాలయా బ్యానర్‍లో చేశాం. అలాగే కన్నడలో శ్రీనాథ్?హీరోగా సినిమా చేశాం.
హిందీలో పద్మాలయా హిస్టరీ!!
హిందీలో పద్మాలయా బ్యానర్‍లో టక్కర్, మేరీ ఆవాజ్ సునో, హిమ్మత్ వాలా, మవాలి, ఖైదీ, జస్టిస్ చౌదరి, కామ్ యాబ్, హోషియార్, పాతాళ్ భైరవి, సింఘాసన్, ముజ్రీమ్, కన్వర్‍లాల్, మహా శక్తిమాన్ త్రీడీ, సూర్యవంశీ, క్యాదిల్‍నే కహా, అమ్దాని అత్తాణి ఖర్చా రుపియా, ఇష్క్ హై తుమ్ సే వంటి బ్లాక్‍బస్టర్స్ను రూపొందించి పద్మాలయా ప్రత్యేకమైన క్రేజ్‍ను సంపాదించుకుంది.
అందరికీ కృతజ్ఞతలు!!
పద్మాలయా బ్యానర్ 50 ఏళ్ల సక్సెస్‍ఫుల్?జర్నీ వెనుక ఎంతో మంది కృషి, ఆశీస్సులు ఉన్నాయి. ఈ సంస్థ ప్రారంభమైనప్పటి నుండి నేటి వరకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 50 ఏళ్లు పూర్తయిన ఈ సందర్భంలో మా నేటి యంగ్ జనరేషన్ కూడా ఆసక్తిని చూపించి మళ్లీ పద్మాలయా బ్యానర్‍కు పూర్వ వైభవాన్ని తీసుకొస్తారని ఆశిస్తున్నాను. మహేశ్ నమ్రత జీఎంబీ బ్యానర్‍లో సినిమాలు చేస్తన్నారు. మహేశ్ కొడుకు గౌతమ్, నేనొక్కడినే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమై మంచి పేరు తెచ్చుకున్నాడు. మహేశ్ కుమార్తె సితార చిన్న వయసులోనే తన డాన్స్ తో, ఇంటర్వ్యూస్‍తో అందరినీ ఆకట్టుకుంటుంది. రమేశ్ కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్‍పై సినిమాలు చేస్తున్నారు. రమేశ్ కొడుకు చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా అభిమానుల్ని ఆకట్టుకున్నాడు. గల్లా అశోక్‍ను హీరోగా పరిచయం చేస్తూ గల్లా జయదేవ్ పద్మావతి, అమర్‍రాజా మీడియా ఎంటర్‍టైన్‍మెంట్స్ లో సినిమాలు చేస్తున్నారు. మంజుల, సంజయ్ ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్‍లో సినిమాలు చేస్తున్నారు. మంజుల అమ్మాయి జాన్వీ కూడా చక్కగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. మా సుధీర్‍బాబు సుధీర్‍బాబు ప్రొడక్షన్స్ లో సినిమాలు చేస్తున్నారు. సుధీర్ కొడుకు కూడా ఆర్టిస్ట్ గా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీగా ఉన్న వి.కె.నరేశ్, విజయ్‍కృష్ణ బ్యానర్‍లో సినిమాలు చేస్తారు. ఇలా టోటల్‍గా అందరూ సినీ రంగంపై ఆసక్తి చూపించడం ఆనందంగా ఉంది. ఆదిశేషగిరిరావు సారథ్యంలో హనుమంతరావు కుమారులు ప్రసాద్, నర్సింగ్‍రావు, బంగారి కుమారుడు బాబీ, నిర్మాణ రంగంలో ముందడుగు వేస్తారని ఆశిస్తున్నాను. పద్మాలయా కోసం ప్రాణం పెట్టి పనిచేసిన వారెందరో ఉన్నారు. పద్మాలయా బ్యానర్ వల్ల ఎందరో ఉన్నత శిఖరాలను అధిరోహించినవారున్నారు. అందరికీ ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు. ఇన్నేయేళ్ళుగా పద్మాలయ ఆదరణ పొందడానికి ముఖ్య కారకులు తెలుగు సినీ ప్రేక్షకులు. అంతకంటే ముఖ్యమైన వాళ్ళు నా అభిమానులు. నా జయాపజయాలతో సంబంధం లేకుండా నన్ను అభిమానిస్తూ నేను చేసిన ప్రతి ప్రయోగాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు, నా అభిమానులకు, మహేష్ బాబు అభిమానులకు నా ప్రత్యేక ధన్యవాదాలు… నమస్కారం…
సదా మీ అభిమానాన్ని అకాంక్షించే…..
మీ కృష్ణ