Vijay Thalapathy: పాదయాత్ర.. కాదు కాదు బస్ యాత్ర, విజయ్ ప్లాన్ ఏంటీ…?

తమిళనాడు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy) తన పార్టీని ఎలాగైనా సరే అధికారంలోకి తీసుకురావాలని టార్గెట్ పెట్టుకుని పని చేస్తున్నాడు. తమిళనాడులో ప్రతిపక్షం బలంగా లేదు అనే అభిప్రాయాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ తరుణంలో ఆ ఖాళీని భర్తీ చేసేందుకు విజయ్ గట్టిగానే కష్టపడుతున్నాడు. అందుకే సినిమాలకు కూడా గుడ్ బై చెప్పేసిన విజయ్, ప్రస్తుతం ఆఖరి సినిమా షూటింగును కంప్లీట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు విజయ్.
తన కెరీర్ లో ఆఖరి సినిమాలపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాకు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విజయ్, సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే పాదయాత్ర మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలొస్తున్నారు. తాజాగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త.. ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishore) తో విజయ్ భేటీ అయ్యాడు. తమిళనాడులో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో తాను ప్రజల్లోకి వెళ్లడానికి ఏ మార్గం ఎంచుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని ప్రశాంత్ కిషోర్ ను అడగగా.. పాదయాత్ర లేదంటే బస్సు యాత్రను ప్రశాంత్ సూచించినట్లు సమాచారం.
రెండు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని ప్రశాంత్.. విజయ్ కు సూచించినట్లు సమాచారం. త్వరలోనే పాదయాత్ర మొదలుపెట్టాలని విజయ టార్గెట్ గా పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటును విజయ్ ఎంతవరకు తనువైపుకు తిప్పుకుంటాడు అనేది చెప్పలేని పరిస్థితి. తమిళనాడులో ఒకప్పటి మాదిరిగా సినిమా వాళ్ళను ఇప్పుడు ఆదరించడం లేదు. అందుకే కమల్ హాసన్ రాజకీయాల్లో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కమల్ రాజకీయాలను పక్కన పెట్టి సినిమాల వైపు ఫోకస్ పెట్టారు.
ఇక రజనీకాంత్ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుని కూడా చివరి నిమిషంలో వెనక్కు తగ్గారు. ఇప్పుడు విజయ్ ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనేది చెప్పలేని పరిస్థితి. అయితే విల్లుపురంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు మాత్రం భారీగా జనాలు రావడంతో విజయ్ ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాల్లో తన మార్క్ చూపించే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. అటు బీజేపీ కూడా తమిళనాడుపై గట్టిగానే ఫోకస్ పెట్టింది. అన్నాడిఎంకే నేతలకు ఇప్పటికే తమ వ్యూహాన్ని బిజెపి అగ్ర నేతలు అందించారు.