Kamal Hassan: పేరుకే లోకనాయకుడా..? క్షమాపణ చెబితే పోయేదేముంది కమల్..!

కన్నడ భాష తమిళం(Tamil) నుంచే పుట్టిందని వ్యాఖ్యలు చేసి, కన్నడిగుల ఆగ్రహానికి గురైన నటుడు కమల్ హాసన్..తన వ్యాఖ్యలను ఉపసంహరించుకునేందుకు ససేమిరా అంటున్నాడు. ఎందరుపెద్ద నేతలు చెప్పినా, ఆఖరికి కర్నాటక హైకోర్టు సూచనలను కూడా పెడచెవిన పెడుతున్నాడు. తాను తప్పేమీ అనలేదని.. ప్రేమతో చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా అంటున్నాడీ లోకనాయకుడు.దీంతో ఇది కాస్తా మరింత తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కమల్‌హాసన్ వారంలోగా సమస్యను పరిష్కరించుకోవాలని కర్ణాటక ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఆయన నిర్మించిన ‘థగ్ లైఫ్’ సినిమా విడుదలను ఎవరూ అడ్డుకోకుండా, ప్రభుత్వం భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ సంస్థ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ ఎం.నాగప్రసన్న పలు వ్యాఖ్యలు చేశారు. ‘ఏ ప్రాతిపదికన కమల్‌హాసన్ ఆ వ్యాఖ్యలు చేశారు? క్షమాపణ చెబితే ఇంతవరకూ వచ్చేది కాదు కదా? భావప్రకటన స్వేచ్ఛ అంటే కన్నడిగుల మనోభావాలను దెబ్బతీయడం కాదనే విషయం తెలియదా? భాష అనేది ప్రజలకు ఉండే సాంస్కృతిక గుర్తింపు. ఒక భాష మాట్లాడే ప్రజలందరినీ కించపరిచేలా వ్యాఖ్యానించే హక్కు ఎవరికీ లేదు. నీరు, నేల, భాష… ఈ మూడూ పౌరులకు చాలా కీలకం. అసలు భాషా ప్రాతిపదికనే రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 75 ఏళ్ల క్రితం రాజగోపాలాచారే ఓ విషయంలో క్షమాపణలు చెప్పారు.
మీరు సృష్టించిన వివాదం వల్ల వాణిజ్యపరంగా ఇబ్బంది రాకూడదని రక్షణ కోసం కోర్టును ఆశ్రయించారు. క్షమాపణలు చెబితే సమసిపోయే అంశాన్ని ఇక్కడి వరకు ఎందుకు తీసుకొచ్చారు? ఆయనేమైనా చరిత్రకారుడా.. భాషావేత్తనా?’ అంటూ జస్టిస్ నాగప్రసన్న నిలదీశారు. వివాదాన్ని మీరే తలపై వేసుకుని.. పరిష్కారం కోరేందుకు వచ్చారా అంటూ చిత్రనిర్మాణ సంస్థ న్యాయవాదిని జస్టిస్ ప్రశ్నించారు. ఇతర భాషలను కించపరిచే, తక్కువ చేసే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు.
న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా కమల్‌హాసన్ బేషరతుగా క్షమాపణలు చెబుతారని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ విశ్వాసం వ్యక్తంచేశారు. కన్నడను కించపరుస్తూ ఎవరు వ్యాఖ్యలు చేసినా కన్నడిగులు ఉపేక్షించరన్నారు. ద్రవిడ భాషలు అన్నీ ఒకదాంతో ఒకటి పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయని, అంతమాత్రాన తమిళం నుంచే కన్నడ పుట్టిందని ఆధారరహిత వ్యాఖ్యలు చేసి కమల్‌హాసన్ తప్పు చేశారని వ్యాఖ్యానించారు.కమల్ వ్యాఖ్యలను బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్ యడియూరప్ప ఖండించారు. కమల్ గౌరవప్రదంగా క్షమాపణలు చెప్పాలన్నారు. క్షమాపణలు ఎవరినీ చిన్నవాళ్లను చేయవని, అలాగే పొగరు ఎవరినీ గొప్పవారిని చేయదని నచ్చజెప్పారు.
కన్నడ భాష గురించి తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని నటుడు కమల్‌హాసన్ తెలిపారు. కర్ణాటకలో ఈ నెల 5న థగ్ లైఫ్ సినిమాను విడుదల చేయబోమని కర్ణాటక హైకోర్టుకు కమల్ తెలిపారు. కేఎఫ్‌సీసీతో చర్చలు జరిగితే తప్ప సినిమాను విడుదల చేసేది లేదని నిర్మాతలు కూడా కోర్టుకు చెప్పిన విషయాన్ని జస్టిస్ నాగప్రసన్న ప్రస్తావించారు. మరోవైపు.. తన వ్యాఖ్యలకు కమల్ క్షమాపణ చెప్పకుంటే కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ సినిమా విడుదలను నిలిపివేస్తామని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నరసింహులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయనకు కమల్‌హాసన్ రాసిన లేఖలో… మనం అందరం ఒకటేనని, కన్నడ భాషను.. ఆ ప్రజలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. కన్నడ గురించి తన వ్యాఖ్యలు అపార్థానికి గురికావడం బాధాకరమన్నారు. ఒక భాషపై మరో భాష ఆధిపత్యాన్ని తానెప్పుడూ వ్యతిరేకిస్తుంటానని పేర్కొన్నారు.