Mahesh Babu: మహేశ్ బాబుకు షాక్.. బ్లాక్ మనీ వ్యవహారంలో ఈడీ నోటీసులు..!!

సూపర్ స్టార్ మహేష్ బాబుకు (Mahesh Babu) ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. ఇదిప్పుడు టాలీవుడ్ (Tollywood)లో సంచలనంగా మారింది. సాయి సూర్య డెవలపర్స్ (Sai Surya Developers), సురానా గ్రూప్‌లతో (Surana Group) సంబంధం ఉన్న ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 27న హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని మహేష్ బాబును నోటీసుల్లో కోరారు. సాయి సూర్య డెవలపర్స్ ప్రమోషన్స్ కోసం మనీలాండరింగ్ (Money laundering) డబ్బులను మహేష్ బాబు తీసుకున్నట్లు ఈడీ అనుమానిస్తోంది.
గత వారం సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ కార్యాలయాలతో పాటు వాటి అధినేతల ఇళ్లపై రెండు రోజుల పాటు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో మనీ లాండరింగ్, ఆర్థిక అక్రమాలకు సంబంధించిన కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సాయి సూర్య డెవలపర్స్ ఎండీ సతీష్ చంద్ర గుప్తా నివాసంలో దొరికిన పత్రాల ఆధారంగా మహేష్ బాబు ఈ కంపెనీ నుంచి రూ.5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ మొత్తంలో రూ. 3.5 కోట్లు నగదు రూపంలోనూ, రూ.2.5 కోట్లు RTGS ద్వారా ట్రాన్స్ ఫర్ జరిగినట్లు విచారణలో తేలింది.
రియల్ ఎస్టేట్ లో పెట్టుబడిదారులను ఆకట్టుకునేందుకు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్‌లు మహేష్ బాబు లాంటి సెలబ్రిటీలను ప్రమోషనల్ కార్యక్రమాలకు ఉపయోగించుకున్నాయి. మహేష్ బాబు ఈ కంపెనీల ప్రకటనలలో నటించడం ద్వారా పెట్టుబడిదారులను ప్రభావితం చేసినట్లు ఈడీ భావిస్తోంది. అయితే ఈ కంపెనీలకు బ్లాక్ మనీతో పాటు.. మనీ లాండరింగ్‌తో సంబంధాలున్నట్లు ఈడీ అనుమానిస్తోంది. మహేష్ బాబుకు ఈ అక్రమాలలో నేరుగా సంబంధం లేనప్పటికీ మనీలాండరింగ్ ద్వారా వచ్చిన బ్లాక్ మనీని ఆ కంపెనీల నుంచి మహేశ్ బాబుకు అందినట్లు ఈడీ భావిస్తోంది. అందులో భాగంగానే మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది.
సురానా గ్రూప్‌కు చెందిన భాగ్యనగర్ ప్రాపర్టీస్ చైర్మన్ నరేంద్ర సురానా, సాయి సూర్య డెవలపర్స్ యజమాని సతీష్ చంద్ర గుప్తా కలిసి రూ.100 కోట్లకు పైగా నల్లధనాన్ని సేకరించి, వివిధ మార్గాల ద్వారా దారి మళ్లించినట్లు ఈడీ విచారణలో వెల్లడైంది. ఈ కంపెనీలపై హైదరాబాద్‌లోని వివిధ పోలీస్ స్టేషన్లలో పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. సోదాల్లో రూ. 74.50 లక్షల నగదు, రూ. 100 కోట్ల నల్లధనానికి సంబంధించిన లెక్కలు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.
ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అయితే, ఈడీ నోటీసు లు జారీ కావడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు తరఫు నుంచి ఈ విషయంపై ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. ఈడీ విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.