Betting Apps: బెట్టింగ్ యాప్స్ కేసు…సెలబ్రిటీలపై ఈడీ కేసు

తెలంగాణలో నిషేధిత బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసు మరో మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) 29 మంది సినీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లపై ఈసీఐఆర్ (ECIR) నమోదు చేసింది. ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రానా దగ్గుబాటి (Daggubati Rana), ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి తదితరులపై ఈడీ కేసు నమోదు చేసింది. వీళ్లతోపాటు హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్ (Bayya Sunny Yadav), లోకల్ బాయ్ నాని వంటి యూట్యూబర్లు కూడా ఉన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, విశాఖపట్నం, సూర్యాపేట, పంజాగుట్ట పోలీసు స్టేషన్లలో నమోదైన ఐదు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది.
ఈ ఏడాది మార్చిలో సైబరాబాద్ పోలీసులు బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై కేసు నమోదు చేశారు. మియాపూర్‌కు చెందిన ఫణీంద్ర శర్మ అనే వ్యాపారి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. పలువురు సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు జంగ్లీ రమ్మీ, ఎ23, జీత్‌విన్, యోలో247, ఫెయిర్‌ప్లే లైవ్, పరిమాచ్, లోటస్365 వంటి నిషేధిత బెట్టింగ్ యాప్స్ ను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ యాప్స్ ఆకర్షణీయమైన ఆఫర్లు, రివార్డులతో యువతను, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆకర్షించి, వారి ఆర్థిక, మానసిక స్థితిని దెబ్బతీస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సైబరాబాద్ పోలీసులు ఈ కేసును బీఎన్‌ఎస్ సెక్షన్‌లు 318(4), 112, 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్‌లు 3, 3(ఎ), 4, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) యాక్ట్ సెక్షన్ 66(డి) కింద నమోదు చేశారు. ఈ యాప్స్ పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867ను ఉల్లంఘిస్తున్నాయని, ఆర్థిక నష్టాలతో పాటు సామాజిక హాని కలిగిస్తున్నాయని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈడీ ఈ కేసును ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద దర్యాప్తు చేస్తోంది. ఈ ప్రచారాల ద్వారా భారీ మొత్తంలో డబ్బు చలామణీ, మనీ లాండరింగ్ జరిగి ఉండవచ్చని భావిస్తోంది.
విజయ్ దేవరకొండ తన బృందం ద్వారా దీనిపై గతంలోనే ఒక ప్రకటన విడుదల చేశారు. తాను కేవలం చట్టబద్ధమైన స్కిల్-బేస్డ్ గేమ్స్‌కు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించానని, ఎ23 కంపెనీతో తన ఒప్పందం గత ఏడాదితో ముగిసిందని, రమ్మీ వంటి గేమ్స్‌ను సుప్రీంకోర్టు గ్యాంబ్లింగ్ నుండి వేరుగా గుర్తించిందని వివరించారు. రానా దగ్గుబాటి కూడా తన ఒప్పందం 2017లో ముగిసిందని, అది చట్టబద్ధమైన స్కిల్-బేస్డ్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించినదని, చట్టపరమైన సమీక్ష తర్వాతే ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ప్రకాష్ రాజ్ కూడా తాను 2016లో జంగ్లీ రమ్మీ ప్రచారం చేశానని, ఆ తర్వాత అది సరైనది కాదని భావించి 2017లో ఒప్పందాన్ని పొడిగించలేదని, యువతను బెట్టింగ్ యాప్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు.
ఈ బెట్టింగ్ యాప్స్ యువతను, ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలను లక్ష్యంగా చేసుకుని, వారి సొమ్మును పెట్టుబడిగా పెట్టమని ప్రోత్సహిస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ యాప్స్ వల్ల చాలా మంది ఆర్థికంగా, మానసికంగా నష్టపోయారని, కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ యాప్స్ మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్‌కు కూడా ఉపయోగపడుతున్నాయని, జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయనే ఆరోపణలున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా సైబరాబాద్ పోలీసు, ఈ యాప్స్ పై గట్టి చర్యలు తీసుకుంటున్నారు. టీజీఎస్‌ఆర్‌టీసీ (TGSRTC) ఎండీ వీసీ సజ్జనార్ ఈ యాప్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా 2024 మేలో ఈ యాప్స్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈడీ ఇప్పుడు ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ ట్రయిల్‌ను లోతుగా పరిశీలిస్తోంది. సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు తమ ప్రచారాల వల్ల సమాజంపై ఏర్పడే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది.