అతని సినిమాలు భిన్నం.. ఎంపిక చేసుకునే కథాంశాలు అంతకంటే విభిన్నం!

సినిమాలు తియ్యడంలో, కథలు ఎంపిక చేసుకునే విధానంలో ఒక్కో డైరెక్టర్‌కి ఒక్కో శైలి ఉంటుంది. అంతేకాదు వాళ్ళు తీసే సినిమాలు ఒక పరిధిలోనే ఉంటాయి. దాన్ని దాటి కొత్త పంథాలోకి వెళ్ళలేరు. దానికి ఉదాహరణగా ఎంతో మంది దర్శకుల పేర్లు చెప్పుకోవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న అలాంటి దర్శకుల్లో క్రిష్‌ను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతని మొదటి సినిమా గమ్యం నుంచి బాలీవుడ్ మూవీ మణికర్ణిక వరకు చేసిన సినిమాలన్నీ విభిన్నమైన కథాంశాలే. సినిమాకి కథే హీరో అని నమ్మే డైరెక్టర్లలో క్రిష్ ఒకరు. అందుకే కథ విషయంలో రాజీ పడకుండా ఒక కొలిక్కి వచ్చేవరకు దానిపై వర్క్ చేస్తూనే ఉంటాడు. ప్రస్తుతం పవన్‌కల్యాణ్ హీరోగా తెరకెక్కతున్న వకీల్‌సాబ్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోఎతున్నాడు పవన్. ఈ సినిమా కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశాడు క్రిష్.
ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల కారణంగా అన్ని రంగాల కంటే సినిమా రంగమే ఎక్కువ నష్టపోతోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయో చెప్పలేం. ఆ సినిమాలను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పలేం. అసలు థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో చెప్పలేం. ఇన్ని అవరోధాల మధ్య పవన్ కల్యాణ్ చేస్తున్న వకీల్ సాబ్ ఎప్పుడు పూర్తవుతుందో తెలీక పోవడంతో ఈలోగా ఓ చిన్న సినిమా స్టార్ట్ చేశాడు క్రిష్. నన్నపరెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన `కొండపొలం` నవలను తెరకెక్కిస్తున్నాడు. వైష్ణవ్‌తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ను వికారాబాద్ అడవుల్లో చిత్రీకరించారు. ఇటీవల వచ్చిన వార్త ఏమిటంటే పవన్‌కల్యాణ్ సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతందని, దాని కోసం ఈ సినిమాను తాత్కాలికంగా పక్కన పెట్టి ఆ సినిమా షూటింగ్‌కి క్రిష్ రెడీ అవుతున్నాడని. అయితే అందులో ఎంతవరకు నిజం ఉందో తెలీదు.
ఇదిలా ఉంటే క్రిష్ మరో నవలను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తోంది. కె.కేశవరెడ్డి రచించిన `అతడు అడవిని జయించాడు` నవల క్రిష్ మనసుకు హత్తుకుందట. అందుకే దాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. వైష్ణవ్ తేజ్‌తో తీస్తున్న సినిమా, ఇప్పుడు చెయ్యాలనుకుంటున్న సినిమా రెండూ అడవి నేపథ్యంలోనే ఉండడం విశేషం.
ఒక అడవి చుట్టు పక్కల ఉన్న గ్రామాల్లోని గొర్రెల కాపరుల జీవన శైలి ఏ విధంగా ఉంటుందనే అంశాన్ని తీసుకొని వైష్ణవ్‌తేజ్ సినిమా ఉంటే, ఇప్పుడు చెయ్యాలనుకుంటున్న సినిమా కథలో ఒక పందిపిల్ల తప్పిపోవడంతో దాన్ని వెతుక్కుంటూ ఓ వృద్ధుడు అడవిలోకి వెళ్తాడు. ఆ తర్వాత జరిగే పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. కమర్షియల్‌గా వర్కవుట్ అవ్వదు అనే ఉద్దేశంతో చాలా మంది దర్శకులు ఇలాంటి ప్రయోగాలు చెయ్యరు. దానికి నిర్మాతలు కూడా అంతగా సహకరించరు. కానీ, క్రిష్ ఇలాంటి సాహసం చెయ్యడం, దానికి నిర్మాతల సపోర్ట్ కూడా బాగా ఉండడంతో తప్పకుండా ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. `అతడు అడవిని జయించాడు` నవలతో రూపొందే సినిమాలో నటీనటులు ఎవరెవరు? నిర్మాత ఎవరు? వంటి విషయాలు తెలియాల్సి ఉంది.