Chiranjeevi: పొలిటికల్ రీ ఎంట్రీ పై స్పష్టత ఇచ్చిన మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఒకప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత చిరంజీవి తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు అన్న ప్రచారం కొనసాగుతోంది. తాజాగా హైదరాబాద్‌లోని (Hyderabad) ఫీనిక్స్ ఫౌండేషన్ (Phoenix Foundation) సౌజన్యంతో జరిగిన రక్తదాన శిబిరానికి ఆయన హాజరై, రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో యువ నటుడు తేజ సజ్జా (Teja Sajja) కూడా పాల్గొని చిరంజీవితో పాటు రక్తదానం చేయడం విశేషం. చిరంజీవి పేరు రక్తదానానికి ముడిపడటం తనకు ఎంతో గర్వంగా ఉందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ప్రతి రక్తదాతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
తేజను చూసి చిరంజీవి ఎంతో అభిమానం వ్యక్తం చేస్తూ, “ఇతనిని నా సొంత కొడుకు లాంటివాడిగా భావిస్తున్నాను” అని ప్రేమతో వ్యాఖ్యానించారు. తన సేవా ప్రయాణంలో ఇలాంటి యువత చేరడం ఎంతో ఉత్సాహాన్నిస్తుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో మాట్లాడిన చిరంజీవి, తాను రాజకీయాలకి దూరంగా ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. ఇటీవల కొందరు రాజకీయ నాయకుల నుండి తనపై వచ్చిన విమర్శల గురించి వ్యాఖ్యానిస్తూ, అనవసరమైన విషయాలపై స్పందించడం కంటే కూడా తన పని తాను చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తానని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే నెగటివ్ కామెంట్లకు తాను స్పందించదలచుకోలేదని అన్నారు.
తన రక్తదాన సేవ ప్రాముఖ్యతను చెబుతూ ఒక భావోద్వేగ సంఘటనను చిరంజీవి గుర్తు చేశారు. ఒక మహిళ, తనని అవమానించిన రాజకీయ నాయకుడిని.. ఆయన బ్లడ్ బ్యాంక్ నుంచి వచ్చిన రక్తంతోటే నా బిడ్డ బతికాడు.. అందుకే చిరంజీవి అంటే మాకు ఎంతో అభిమానం అని ప్రశ్నించడం తనకు ఎంతో బలాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
తనలో రక్తదానం ప్రారంభించాలని ఆలోచన రావడానికి కారణమైన సంఘటనను గుర్తు చేస్తూ, ఒక జర్నలిస్ట్ రాసిన కథనం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని చెప్పారు. ఆ రచయితను తాను ఎన్నడూ కలవకపోయినా, అతని ప్రభావం మాత్రం జీవితాంతం తనపై అలా ఉండిపోయిందని చిరంజీవి చెప్పారు.
ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)తో జరిగిన సమావేశం తర్వాత ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు వచ్చినా, తాను ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యంలో లేదని చిరంజీవి మరొకసారి తేల్చిచెప్పారు. తన సామాజిక సేవా కార్యక్రమాలకే పూర్తి సమయం కేటాయిస్తానని స్పష్టం చేశారు.చివరిగా, తన సేవా యాత్రకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ప్రపంచవ్యాప్తంగా ధన్యవాదాలు తెలుపుతూ చిరంజీవి ప్రసంగాన్ని ముగించారు.