Aap Jaisa Koi: వీకెండ్‌కు ఓటీటీ లో మేచ్యూర్డ్ లవ్ స్టోరీగా ‘ఆప్ జైసా కోయి’..

ఈ వారం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ వేదికగా విడుదలైన తాజా చిత్రం ‘ఆప్ జైసా కోయి’ (Aap Jaisa Koi) ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది ఓ మెచ్యూర్డ్ లవ్ స్టోరీగా ప్రమోట్ చేయబడినప్పటికీ, కథలో కొత్తదనం లేకపోవడంతో కామెంట్లు మిశ్రమంగా వచ్చాయి. ఇందులో ప్రధాన పాత్రలుగా నటించిన మాధవన్ (R. Madhavan) మరియు ఫాతిమా సనా షేక్ (Fatima Sana Shaikh) తమ శైలిలో నటనను ప్రదర్శించారు.
కథ పరంగా చూస్తే, జమ్షెడ్‌పూర్ (Jamshedpur) అనే చిన్న పట్టణంలో సంస్కృత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీరేణు అనే వ్యక్తి జీవితం చుట్టూ సాగుతుంది. ఈ పాత్రలో మాధవన్ 42 ఏళ్ల వయసులోనూ ఇంకా ప్రేమను ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒంటరి మనిషిగా కనిపిస్తారు. కాలక్రమంలో అతనికి ఒక ఫ్రెంచ్ టీచర్ అయిన మధు బోస్ అనే యువతితో పరిచయం అవుతుంది. మధు పాత్రను ఫాతిమా సనా షేక్ పోషించారు. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలూ, ఆకర్షణలూ కలగలిసి ఓ సున్నితమైన ప్రేమకథగా మారుతుంది.
ఈ సినిమా బలమైన అంశం మాధవన్, ఫాతిమాల మధ్య కెమిస్ట్రీ. మాధవన్ మళ్లీ తన ‘3 ఇడియట్స్’ రోజులు గుర్తుకొచ్చేలా ఉన్నారు, ఫాతిమా తన పాత్రలో స్వతంత్ర భావజాలాన్ని ప్రదర్శించారు. కానీ కథలో ఫీల్ ఉన్నా, సీన్‌లు మాత్రం చాలా వరకూ ఊహించదగినవి. మధు గతంలో ప్రేమించిన వ్యక్తి మళ్లీ ఆమె జీవితంలోకి రావడం, హీరో,హీరోయిన్స్ మధ్య చిన్న చిన్న విభేదాలు రావడం లాంటి అంశాలు చాలా సినిమాల్లో చూసినవే. ఇవి కొన్ని చోట్ల ‘రాకీ ఔర్ రాణీ’ సినిమాను గుర్తుచేస్తాయి.
సాంకేతికంగా చూస్తే, సినిమాకు జస్టిన్ ప్రభాకరణ్ (Justin Prabhakaran) సంగీతం బలంగా నిలిచింది. పాటలు చాలా సహజంగా కథలో మిళితమై సినిమా ఫీల్‌ను మరింత పెంచాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా మూవీకి బాగా సెట్ అయ్యింది .కానీ కథనం మాత్రం ప్రత్యేకంగా అనిపించదు. ఇంతక ముందు చూసిన ఫీల్ కలుగుతుంది. ఈ మూవీ చూసిన తర్వాత ఓ ప్రశాంతమైన ప్రేమకథను చూసిన అనుభూతి కలుగుతుంది. పూర్తిగా కొత్తగా ఏం లేదుగానీ, వారాంతంలో ఓ సాఫ్ట్ మూవీ కావాలనుకునే వారు మాత్రం ఒకసారి చూడవచ్చు. ఫీల్‌గుడ్ ఎమోషన్లు కోరుకునే ప్రేక్షకులకు ఇది సరైన ఎంపిక అయ్యే అవకాశముంది.