కైవల్య వోహ్రా అరుదైన ఘనత.. 21 ఏళ్లకే

ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ జెప్టో సహ వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా అరుదైన ఘనత దక్కించుకున్నారు. హురూన్ బిలియనీర్ల జాబితాలో అతి చిన్న వయస్కుడిగా ఆయన చోటు దక్కించుకున్నారు. 21 సంవత్సరాల కైవల్య వోహ్రా 3,600 కోట్ల సంపదతో చిన్న వయస్సు బిలియనీర్లలో అగ్రస్థానంలో ఉన్నారు. జెప్టో మరో సహ వ్యవస్థాపకుడు 22 సంవత్సరాల అదిత్ పాలిచా రెండో స్థానంలో ఉన్నారు. కైవల్య వోహ్రా, అదత్ పాలిచా ఇద్దరూ స్టోన్‌ఫోర్ట్ యూనివర్సిటీ విద్యార్థులే. కంప్యూటర్ సైన్స్ కోర్సును మధ్యలోనే ఆపేసి వ్యాపార రంగంలోకి ప్రవేశించారు.
కొవిడ్ మహమ్మరి విజృంభన సమయంలో క్విక్ డెలివరీ, కాంటాక్ట్‌లెస్ డెలివరీకి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో వీరు ఇద్దరూ ఈ రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు. 2021లో వీరు జెఫ్టోను ప్రారంభించారు. జెప్టో దేశీయంగా తన బిజినెస్‌ను విస్తరిస్తోంది. గ్రోసరీ డెలివరీ విభాగంలో ప్రముఖ ఈ`కామర్స్ సంస్థ అమెజాన్, స్విగ్గి ఇన్‌స్టామార్ట్, జొమాటో, బ్లింకిట్, టాటా గ్రూప్‌కు చెందిన బిగ్ బాస్కెట్ వంటి సంస్థలకు గట్టి పోటీ ఇస్తోంది. 19 సంవత్సరాల వయస్సులోనే కైవల్య వోహ్రా హురూన్ ఇండియా రిచ్ జాబితాలో 2022లో మొదటిసారి చోటు సాధించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఆయన ఈ జాబితాలో కొనసాగుతున్నారు. ఈసారి హురూన్ బిలియనీర్ల జాబితాలో ఇండియన్స్ సంఖ్య మొదటిసారి 300కు చేరింది.