World Bank : భారత్ వృద్ధి 6.3 శాతమే .. ప్రపంచ బ్యాంక్ అంచనా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025-26) భారత జీడీపీ (India’s GDP) 6.3 శాతం వృద్ధి నమోదు చేస్తుందన్న గత అంచనాలను ప్రపంచ బ్యాంక్ (World Bank ) కొనసాగించింది. అంతర్జాతీయంగా అనిశ్చితులు భారత ఎగుమతుల (Indian exports) పై చూపిస్తున్న ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంది. భారత్ ఇప్పటికీ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేర్కొంది. 2025-26లో భారత వృద్ధి రేటు 6.7 శాతం ఉండొచ్చని జనవరిలో ప్రపంచబ్యాంక్ అంచనా వేయగా, అమెరికా టారిఫ్‌లు (US tariffs) , అంతర్జాతీయంగా అనిశ్చితుల నేపథ్యంలో దీన్ని 6.3 శాతానికి తగ్గిస్తున్నట్టు ఏప్రిల్‌లో ప్రకటించింది. ఇప్పుడు మరోసారి ఏప్రిల్ అంచనానే కొనసాగిస్తున్నట్టు తెలిపింది. వాణిజ్య ఉద్రిక్తతలు, విధానపరమైన అనిశ్చితులతో ఈ ఏడాది అంతర్జాతీయ వృద్ధి 2.3 శాతానికి క్షీణిస్తుందంటూ తన తాజా నివేదికలో ప్రపంచ బ్యాక్ పేర్కొంది. ఈ ఏడాది ఆరంభంలో వేసిన అంచనా కంటే ఇది అర శాతం తక్కువ. ప్రపంచవ్యాప్తంగా 70 శాతం ఆర్థిక వ్యవస్థల వృద్ధి అంచనాల తగ్గింపునకు అంతర్జాతీయ అనిశ్చితులను కారణంగా ప్రపంచ బ్యాంక్ ప్రస్తావించింది.