F35 Fighter Jet: ఎఫ్-35 యుద్ధవిమానం ఎందుకంత స్పెషల్..?
సౌదీకి అమెరికా ఎఫ్-35 ఆఫర్ చేయడంతో .. ఒక్కసారిగా పశ్చిమాసియా వేడెక్కింది. ఎందుకంటే ఇది అత్యాధునిక యుద్ధవిమానం. ఇది ఎవరి దగ్గర ఉంటే ప్రత్యర్థిపై వారి ఆధిపత్యం తధ్యమని చెబుతారు. మరి అలాంటిది సౌదీకి.. అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానాలు అమ్మేందుకు సిద్ధం కావడంతో.. ఇక్కడి రాజకీ యపరిణామాలు చకచకా మారబోతున్నాయి. ఇప్పటివరకూ ఇజ్రాయెల్ కు మాత్రమే అమెరికా ఈ యుద్ధవిమానాన్ని అందించింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రత్యర్థుల్లో ఒకరైన సౌదీకి .. ఈయుద్ధవిమానాని అందించనుంది అమెరికా.
మరి ఈ ఎఫ్-35 యుద్ధవిమానం ఎందుకంత స్పెషల్..?
F35 యుద్ధవిమానాల రాడార్లు, ప్రత్యర్థి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కళ్లుగప్పి శత్రు స్థావరాలను ధ్వంసం చేయగలవుఈ ఫైటర్ జెట్లలో F-135 ఇంజిన్‌ను వినియోగిస్తారు. అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్, నిఘా, పర్యవేక్షణ సామర్థ్యాలు ఉన్నాయి.ఈ యుద్ధ విమానాల్లో ఉన్న ఓపెన్ ఆర్కిటెక్చర్, అడ్వాన్స్డ్ సెన్సార్లు కారణంగా ఇది సుదూర లక్ష్యాలపై సైతం సులువుగా దాడులు చేయగలవు.ఈ ఫైటర్ జెట్ అభివృద్ధికి దాదాపు 2 ట్రిలియన్ యూఎస్ డాలర్లకు పైగా ఖర్చు చేశారు.ఇది 40 వేల పౌండ్ల థ్రస్ట్‌ను ఉత్పత్తి చేయగలదు. అత్యధికంగా గంటకు 1200మైళ్ల వేగంతో ప్రయాణించగలదు..
రాడార్లలో అతిచిన్న సిగ్నేచర్‌ను మాత్రమే సృష్టిస్తుంది. దానిని ఏదో పక్షి అనుకొని శత్రుసైన్యం భ్రమించేలా చేయగలదు. కొన్ని సందర్భాల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కళ్లుగప్పుతుంది.
దీని కాక్‌పిట్ విలాసవంతమైన కార్లతో పోటీ పడుతుంది. మిగిలిన ఫైటర్ జెట్ల వలే దీనిలో వివిధ రకాల పరికరాలు, ఉండవు. భారీ టచ్స్క్రీన్లు, హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే పైలట్లకు సౌకర్యవంతంగా ఉంటాయి. వారికి రియల్‌టైమ్ ఇన్ఫర్మేషన్ను అందిస్తాయి.
ఈ జెట్ల హెల్మెట్ ఖరీదే 4 లక్షల డాలర్లు ఉంటుంది. అంటే ఓ విలాసవంతమైన కారు ధరతో సమానం.
ఈ విమానం దాదాపు 6 నుంచి 8.1 టన్నుల బరువైన ఆయుధాలను మోసుకెళ్లగలదు.
ఈ విమానంతో భారీ ఆయుధాలను కూడా ప్రయోగించే అవకాశం ఉంది. అదే సమయంలో స్టెల్త్తో ఎక్కడా రాజీ పడాల్సిన అవసరం రాదు.
అమెరికా ఆయుధ తయారీ సంస్థ లాక్‌హీడ్ మార్టిన మరో రెండు సంస్థలతో కలిసి ఎఫ్-35 ఫైటర్ జెట్లను తయారు చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ యుద్ధవిమానాల్లో ఇది ఒకటని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ యుద్ధవిమానాల్లో F35A, F35B, F35C అని మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.
ఇందులో ప్రాథమిక వేరియంట్ అయిన F35-A ధర 80 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు 695 కోట్ల రూపాయలుఉంటుంది. సాంప్రదాయిక టేకాఫ్, ల్యాండింగ్ వెర్షన్ అయిన దీనిని ప్రధానంగా అమెరికా వైమానిక దళం ఉపయోగిస్తుంది.
రన్‌వే లేకపోయిన నిట్టనిలువునా గాల్లోకి ఎగరడం సహా ల్యాండ్ కూడా కాగల సామర్థ్యం F35-B సొంతం. దీని ధర 115 మిలియన్ డాలర్లు అంటే 990 కోట్లు ఉంటుంది.
F35-C వేరియంట్‌ను ప్రత్యేకంగా విమాన వాహక నౌకల కోసం డిజైన్ చేశారు. ధర 110 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 955 కోట్ల రూపాయలు ఉంటుంది.
అంతే కాకుండా ఈ యుద్ధ విమానాలను నడిపేందుకు ప్రత్యేక పైలట్ శిక్షణ అవసరం ఉంటుంది. ఈ విమాన తయారీ నుంచి వినియోగం వరకు అమెరికా సన్నిహిత దేశాలకు మాత్రమే అవకాశం లభించింది. యూకే, ఇటలీ, నార్వేలు దీని తయారీలో భాగస్వాములుగా ఉన్నాయి. ఇవి వాటి వాయుసేనల్లో దీనిని భాగం చేసుకొన్నాయి. ఇక జపాన్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్‌కు మాత్రం… వీటిని విక్రయించారు. ఇటీవల ఇరాన్‌పై దాడుల్లో ఇజ్రాయెల్ వీటిని వాడినట్లు తెలుస్తోంది.






