Washington: డాలర్ క్షీణత… అమెరికాపై నమ్మకం లేదంటున్న పెట్టుబడిదారులు..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) వైఖరి.. ఆదేశం కొంప ముంచుతోందా..? టారిఫ్ లతో అమెరికా ఆదాయం పెరుగుతుందని ట్రంప్ చెబుతున్నారు. కానీ..టారిఫ్ విధానంతో పాటు, డాలర్‌కు వస్తున్న అధిక విక్రయాలూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే, డాలర్ విలువ జనవరి నుంచి 9% తగ్గింది. మూడేళ్లలోనే తక్కువ స్థాయికి డాలర్ చేరింది.ప్రపంచ వాణిజ్య రూపురేఖల్ని మార్చాలని ట్రంప్ ప్రయత్నిస్తుండడంతో, అమెరికాపై ప్రపంచ దేశాలు విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
డాలరుపై నమ్మకం పోతే ఏం జరుగుతుంది?
అంతర్జాతీయ వాణిజ్యంలో ఇప్పటిదాకా డాలరుదే ఆధిపత్యం. 5 దశాబ్దాలుగా అది భద్రమైన కరెన్సీగా నిలిచింది. అమెరికాలో రుణాలు తక్కువకే లభించడం.. ఆ దేశాన్ని ఒక శక్తిగా మార్చాయి. ప్రభుత్వానికి, వినియోగదార్లకు, వ్యాపారులకు తక్కువ రేట్లకే రుణాలు లభించడంతో ఆర్థిక వృద్ధి వేగంగా పరుగులు తీసింది. అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. అమెరికాపై మదుపర్లు విశ్వాసాన్ని కోల్పోతే ఆ దేశం భారీ స్థాయిలో ప్రయోజనాలను కోల్పోతుంది. డాలరుకు ఉన్న ఆధిపత్యం తొలగిపోతుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఆర్థికవేత్త బారీ ఐషన్‌గ్రీన్ అంటున్నారు. డాలర్ విలువ మరింత బలహీనపడొచ్చన్న అంచనాలూ ఉన్నాయి.
డాలరు తనకున్న బలమైన, భద్రమైన లక్షణాలను కోల్పోతూ ఉండడంతో ‘విశ్వాస సంక్షోభం’ ఏర్పడొచ్చని డాయిష్(daish) బ్యాంక్ అంటోంది. డాలరు ఆధిపత్యం ఇప్పటికే కొంత మేర ప్రశ్నార్థకంలో పడిందని చెబుతోంది.. సాధారణంగా టారిఫ్‌ల(tarrifs) వల్ల విదేశీ ఉత్పత్తులకు గిరాకీ తగ్గుతుంది కాబట్టి డాలరు బలోపేతం కావాలి. కానీ ప్రస్తుత పరిణామాల్లో బలోపేతం కావడం అటుంచి, విలువ క్షీణిస్తుండటం ఆర్థికవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. వినియోగదార్లను ఇబ్బంది పెడుతోంది. ఏప్రిల్‌లో యూరో, పౌండ్‌తో పోలిస్తే 5% , జపాన్ యెన్‌తో పోలిస్తే 6% మేర డాలర్ విలువ తగ్గింది. ‘ఫ్రెంచి వైన్, దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్.. కేవలం టారిఫ్‌ల వల్ల అమెరికాలో ప్రియం కాలేదు. డాలర్ బలహీనతా కారణమైంద’ని చెబుతున్నారు.
ఏం జరుగుతుంది?
డాలరు తన భద్రమైన హోదా కోల్పోతే, అమెరికా వినియోగదార్లకూ నష్టమే. రుణ రేట్లు పెరుగుతాయి. ఇప్పటికే వార్షిక ఆర్థిక ఉత్పత్తిలో 120% మేర ఉన్న అమెరికా ప్రభుత్వ రుణాలు, అధిక రుణ రేట్ల వల్ల మరింత పెరుగుతాయి. ఇది జరిగితే ప్రజలు డాలరుకు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కునే ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలూ జరుగుతున్నాయి.
బిట్‌కాయిన్‌కు ప్రాధాన్యమా!
బిట్‌కాయిన్ వంటి డిజిటల్ ఆస్తులకు తన స్థానాన్ని డాలరు కోల్పోయే ప్రమాదమూ ఉందని బ్లాక్‌రాక్ ఛైర్మన్ లారీ ఫింక్ అంచనా వేస్తున్నారు. వివిధ దేశాలపై టారిఫ్‌ను తీసుకొచ్చిన విధానం వల్ల.. తమ పెట్టుబడులకు తక్కువ స్థిరమైన, తక్కువ విశ్వాసం గల, తక్కువ భద్రమైన దేశంగా అమెరికాను పెట్టుబడిదార్లు భావించే ప్రమాదం లేకపోలేదు.
బ్రెజిల్‌తో వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యానికి, తన కరెన్సీ అయిన యువాన్ ప్రకారమే చైనా ఒప్పదం కుదుర్చుకుంటోంది. రష్యా చమురు, దక్షిణ కొరియా నుంచి ఇతర వస్తువుల కొనుగోలుకూ యువాన్‌తోనే వాణిజ్యం చేస్తోంది. అర్జైంటీనా, పాకిస్థాన్ వంటి దేశాలకు యువాన్ రూపంలోనే రుణాలు ఇస్తూ డాలరుకు ప్రత్యామ్నాయంగా మారాలని చూస్తోంది.