Washington: గొప్పదేశంతో భారీడీల్.. ట్రంప్ సంచలన ప్రకటన

ప్రపంచదేశాలపై టారిఫ్ లు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్… వారితో ఒప్పందాల దిశగా సాగుతున్నారు. ఈక్రమంలో సుంకాల భారం నుంచి ఉపశమనం కావాలంటే తమతో ట్రేడ్ డీల్ (Trade Deal) చేసుకోవాలని మిగిలిన దేశాలకు సూచించారు. దీంతో అనేక దేశాలు అగ్రరాజ్యంతో చర్చలు జరుపుతున్నాయి. ఈక్రమంలోనే ట్రంప్ తాజాగా ఓ ఆసక్తికర ప్రకటన చేశారు. ఓ గొప్ప దేశంతో భారీ డీల్ జరగబోతోందంటూ టీజర్ పోస్ట్ చేశారు.
‘‘రేపు ఉదయం 10 గంటలకు ఓవల్ ఆఫీసులో అతిపెద్ద మీడియా సమావేశం జరగనుంది. ఓ గొప్ప, గౌరవప్రదమైన దేశంతో వాణిజ్యఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. ఆ దేశం అందరికంటే ముందుంది’’ అని అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో రాసుకొచ్చారు. అయితే, ఆ దేశం ఏదనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. దీంతో ఈ పోస్ట్‌పై ఉత్కంఠ నెలకొంది.
భారత్, చైనా సహా పలు దేశాలపై ట్రంప్ భారీఎత్తున టారిఫ్‌లు విధించారు. ఆ తర్వాత చైనా మినహా ఇతర దేశాలకు ఈ సుంకాల నుంచి 90 రోజుల మినహాయింపు కల్పించారు. దీంతో పలు దేశాలు అగ్రరాజ్యంతో చర్చలు జరిపాయి. ఈక్రమంలోనే భారత్, జపాన్, దక్షిణ కొరియా దేశాలతో త్వరలో డీల్ కుదరొచ్చని ట్రంప్ యంత్రాంగం ఇటీవల సూచనప్రాయంగా వెల్లడించింది. తాజాగా అధ్యక్షుడు కూడా మెగా డీల్(Mega deal) అంటూ పోస్ట్ చేయడంతో.. ఈ మూడు దేశాల్లో ఏదో ఒక దానితో వాణిజ్య ఒప్పందం ఖరారై ఉంటుందని సమాచారం.
మరోవైపు, టారిఫ్‌ల నేపథ్యంలో అమెరికా-చైనా చర్చలకు సిద్ధమయ్యాయి. చైనాకు చెందిన అత్యున్నత స్థాయి ప్రతినిధుల బృందంతో అమెరికా ఉన్నతాధికారులు ఈ వారం చివర్లో స్విట్జర్లాండ్‌లో సమావేశం అయ్యే అవకాశం ఉంది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్, ఆ దేశ వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్.. జెనీవాలో చైనా ఉన్నతాధికారులతో సమావేశం అవుతారని అమెరికా ప్రభుత్వం వెల్లడించింది.