భారత్, ఆస్ట్రేలియా మధ్య చారిత్రాత్మక ఒప్పందం
భారత్, ఆస్ట్రేలియా ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. ఎగుమతుల పరంగా ఉన్న అవరోధాలు తొలిగిపోనున్నాయి. ఈ ఒప్పందంతో ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న 27 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం.. వచ్చే ఐదేళ్లలో 45 బిలియన్ డాలర్లకు చేరుకుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి డాన్ టెహాన్ తో కలిసి, పీయూష్ గోయల్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. వర్చువల్గా జరిగిన ఈ కార్యక్రమానికి ఇరు దేశాల ప్రధానులు మోదీ, స్కాట్ మారిసన్ హాజరయ్యారు.
భారత్-ఆస్ట్రేలియా భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుంది. ఆస్ట్రేలియాకు భారత్ నుంచి ఎగుమతులు గత 12 నెలల్లో ఎంతగానో పెరిగాయి. చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం అని గోయల్ ప్రకటించారు. చాలా స్వల్ప కాలంలోనే ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం రెండు దేశాల మధ్యనున్న విశ్వాసానికి నిదర్శనంగా ప్రధాని మోదీ ప్రకటించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు ఇది నీటి విప్లవం వంటిదని పేర్కొన్నారు.






