కీలక వడ్డీ రేట్లు మళ్లీ యథాతథం : శక్తికాంత దాస్

కీలక వడ్డీరేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచింది. అంతా ఊహించినట్లుగానే రెపోరేటును 6.5 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. భారత వృద్ధిరేటు చాలా మంది విశ్లేషకుల అంచనాలను మించి నమోదవుతోందని దాస్ తెలిపారు. దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు బలంగా ఉన్నాయన్నారు. ఆహార ధరల్లో అనిశ్చితి ప్రధాన ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతోందని వివరించారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని లక్ష్యిత పరిధి అయిన నాలుగు శాతం లోపునకు తీసుకువచ్చే విషయంలో ఎలాంటి మార్పులేదన్నారు. 2024లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి స్థిరంగా ఉంటుందని అంచనా వేశారు.