ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఓలా

ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఉద్యోగులకు షాకిచ్చింది. 500 మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. కంపెనీ తన పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా వివిధ విభాగాల్లో, వేర్వేరు స్థాయిల్లో ఉన్న వ్యక్తులకు లేఆఫ్ ప్రకటించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విక్రయానంతరం సేవల విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్న వేళ ఓలా ఎలక్ట్రిక్ నుంచి ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం.
ఈ తొలగింపు ప్రక్రియ జులై నుంచి కొనసాగుతోందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తి వెల్లడిరచారు. వివిధ విభాగాల్లో వివిధ స్థాయిల్లో దశలవారీగా ఈ తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఈ నెలాఖరుకల్లా లేఆఫ్‌ల ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న శ్రామికశక్తిని సమర్థంగా వినియోగించుకుని తద్వారా మార్జిన్లు, లాభదాయకతను పెంచుకోవాలని కంపెనీ భావిస్తున్నట్లు పేర్కొన్నారు.