కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో అమెరికా ఆర్థికమంత్రి భేటీ
ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా విధించిన ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని భావిస్తున్నట్లు అమెరికా ఆర్థికమంత్రి జానెట్ ఎల్ యెలెన్ వెల్లడించారు. రష్యా సైనిక, పారిశ్రామిక వ్యవస్థలను దెబ్బతీయటం తమ లక్ష్యమని తెలిపారు. జి-20 ఆర్థిక మంత్రులు, కేంద్రీయ బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్ఎంసీజీ) సమావేశాలు కొనసాగన్ను క్రమంలో పాల్గొనేందుకు ఆమె బెంగళూరుకు వచ్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ బహుళపక్ష కూటమిలో ఉన్న 30 దేశాలు రష్యా ఆర్థిక మూలాలను నియంత్రించంచేందుకు ఉమ్మడి ప్రణాళికలు అమలు చేయనున్నాయని యెలెన్ తెలిపారు. యుద్దానికి అవసరమైన నిధులు సమకూర్చే పారిశ్రామిక ఆదాయాలను పరిమితం చేయటం లక్ష్యమన్నారు.
ఇదే సందర్భంగా ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు, రష్యా దాడిని ఎదుర్కొనేందుకు రానున్న నెలల్లో 10 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించారు. ఆ దేశానికి రుణసాయం అందించేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుకుంటున్నామన్నారు. ఇదే క్రమంలో రష్యాకు వస్తు, ఆర్థికపరమైన సాయం అందించే దేశాల పట్ల కఠిన వైఖరి ప్రదర్శించక తప్పదంటూ చైనాకు పరోక్షంగా ఆమె హెచ్చరికలు జారీ చేశారు. అతి తక్కువ వ్యయంతో యుద్ధంలో విజయం సాధించాలన్న రష్యా దూరాలోచనకు గండిపడిందన్నారు. కొన్ని నెలల క్రితం అంచనా వేసిన దాంతో పోలిస్తే ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని యెలెన్ అభిప్రాయపడ్డారు.






