ఉద్యోగులకు షాక్ ఇచ్చిన నైకీ… రెండు శాతం సిబ్బందిని

ప్రముఖ స్పోర్ట్స్ వేర్ తయారీ సంస్థ నైకీ ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీలో పనిచేస్తున్న వారిలో రెండు శాతం సిబ్బందిని తీసివేయనున్నట్లు ప్రకటించింది. సంస్థలో 83,700 మంది పనిచేస్తున్నట్లు సమాచారం. వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగుల తొలగింపు తప్పట్లేదని నైకీ తెలిపింది. భవిష్యత్ విక్రయాల అంచనాలు నిరాశాజనకంగా ఉన్న నేపథ్యంలో కార్యకలాపాలను క్రమబద్ధీకరించాల్సిన ఆవశ్యకత ఏర్పడిరదని పేర్కొంది. వృద్ధి అవకాశాలను మెరుగుపర్చడానికి కఠిన నిర్ణయాలు తప్పడం లేదని చెప్పింది. దాదాపు రెండు బిలియన్ డాలర్ల ఖర్చులను ఆదా చేయాలనుకుంటున్నట్లు కంపెనీ డిసెంబర్‌లోనే ప్రకటించడం గమనార్హం. అప్పటి నుంచి దాని షేర్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెండు శాతం నష్టపోయాయి. ఉద్యోగుల తొలగింపులను రెండు దశల్లో చేపట్టనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. తొలి దశ నేటి నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించింది. రెండో విడత తొలగింపులు నాలుగో త్రైమాసికం చివరి నుంచి ఉంటాయని పేర్కొంది.