Microsoft: మైక్రోసాఫ్ట్‌లో మరోసారి లేఆఫ్‌లు

ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) మరోసారి ఉద్యోగుల (Employees) తొలగింపు చర్యలు చేపట్టింది. ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపిన సంస్థ, తాజాగా మరో 300 మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. సంస్థ కార్యకలాపాల్లో కృత్రిమమేధ వినియోగాన్ని పెంచే దిశగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ లేఆఫ్‌లు (Layoffs) చోటుచేసుకున్నాయి. ఏఐ (AI), ఆటోమేషన్ వైపు పయనిస్తున్న నేపథ్యంలో ఉద్యోగాల కోతలు ప్రారంభించింది. అందులో భాగంగానే గత నెలలో సుమారు 6వేల మందికి ఉద్వాసన పలికింది. అయితే, ఇందులో ఏఐ వ్యవస్థలు రూపొందించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఎక్కువగా ఉన్నారు. మార్కెట్‌లో పైచేయి సాధించేలా సంస్థను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సంస్థాగత మార్పులను అమలుచేస్తూనే ఉంటామని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి తెలిపారు. ఏఐ రంగంలో వేగంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో, వ్యాపార ప్రాధాన్యాలను సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మైక్రోసాఫ్ట్ తాజా రౌండ్‌లో ఏ ఉద్యోగాలను తొలగించిందో వెల్లడిరచలేదు.