రష్యా ప్రతిపాదనను తిరస్కరించిన ఇటలీ
గ్యాస్ దిగుమతులకు ఇకపై రూబుల్స్లో చెల్లింపులు జరపాలన్న రష్యా నిబంధనను ఇటలీ తిరస్కరించింది. ఇది ఇయు ఆంక్షలను ఉల్లంఘించడమేనని ఇటలీ విదేశాంగ మంత్రి లుయిగి డి మయో స్పష్టం చేశారు. గ్యాస్ సరఫరాల కోసం కొత్త మార్గాలను ఇటలీ ప్రభుత్వం అన్వేషిస్తుందని అన్నారు. ఇప్పటికే అల్జీరియాలో ప్రధాని మారియో డ్రాగి పర్యటించారని, సమీప భవిష్యత్తులో ఆంగోలా, కాంగోలతో అదనపు సరఫరాలపై చర్చిస్తామని అన్నారు. తమపై ఆంక్షలు విధించిన దేశాలు ఇకపై రష్యా గ్యాస్ కోసం రూబుల్స్లోని చెల్లింపులు జరపాల్సి వుంటుందని మార్చిలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దానిపై ఇయుకి చెందిన వివిధ దేశాల నుండి తీవ్ర ప్రతికూల స్పందన ఎదురైంది. హంగరీ, స్లొవేకియా వంటి కొన్ని దేశాలు మాత్రం రూబుల్స్లో చెల్లింపులకు సుముఖత వ్యక్తం చేశాయి. సమీప భవిష్యత్తులో అన్ని రష్యా ఉత్పత్తులకు రూబుల్స్లోనే చెల్లింపులు జరపాల్సి వుంటుందని రష్యా సూచన ప్రాయంగా తెలిపింది.






