క్రిప్టోపై భారత్ సరైన నిర్ణయం : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
క్రిప్టోకరెన్సీ నియంత్రణపై భారత్ సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. క్రిప్టోపై నిర్ణయాలకు తొందరపడరాదని అభిప్రాయపడ్డారు. వినూత్నత, బ్లాక్చైన్లో వస్తున్న డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీల పురోగతిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. క్రిప్టోకు సంబంధించి ఎవ్వరినీ నొప్పించే యోచన లేదని, అయితే ప్రతి దేశానికి సొంత నియంత్రణ అవసరమని అన్నారు. క్రిప్టో కరెన్సీల వల్ల మలీలాండరింగ్, ఉగ్రవాదులకు నిధులు అందే ప్రమాదం ఉందని పునరుద్ఘాటించారు. భారత్కు మాత్రమే ఇవి సమస్య కాదని, అంతర్జాతీయ వేదికలపై పలు దేశాలు ఇదే అంశాన్ని ప్రస్తావించాయని గుర్తు చేశారు. ఆర్బీఐ నియంత్రణలో భారత్ సొంత డిజిటల్ కరెన్సీని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.






