సింగపూర్ పేనౌ, యూపీఐ కనెక్టివిటీ ఆవిష్కరణ
దేశంలో అత్యంత ప్రాధాన్యత గల చెల్లింపుల విధానంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) మారడంతో త్వరలోనే నగదు లావాదేవీలను మించి డిజిటల్ లావాదేవీలు జరుగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. భారత్, సింగపూర్ మధ్య డిజిటల్ లావాదేవీలను సులభతరం చేసే అనుసంధాన ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చారు. మన దేశానికి చెందిన యూపీఐ, సింగపూర్‌కు చెందిన పేనౌల మధ్య ఈ ప్రక్రియను ఇరు దేశాల ప్రధానులు ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ నగదు లావాదేవీలను డిజిటల్ లావాదేవీలు మించిపోనున్నాయని చాలా మంది నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా రూపొందించిన యూపీఐ పద్ధతిలో జరుగుతోన్న లావాదేవీలు ఎంతో సురక్షితంగా మారాయి. గత ఏడాదిలో రూ.126 లక్షల కోట్లకు పైగా విలువైన 7,400 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇవి సుమారు 2 లక్షల కోట్ల సింగపూర్ డాలర్లతో సమానం అని ఆయన వెల్లడించారు.






