వారానికి 3 రోజులు రావాల్సిందే : హెచ్‌సీఎల్

హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ డిజిటల్ ఫౌండేషన్ సర్వీసెస్ కింద పనిచేస్తున్న ఉద్యోగులంతా వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 19 నుంచి డీఎఫ్‌ఎస్ కింద పనిచేస్తున్న ఉద్యోగులంతా కార్యాయాలకు రావాలని హెచ్‌సీఎల్ టెక్నాలజీ ఉద్యోగులకు పంపిన మెమోలో పేర్కొంది. నిర్దేశించిన కార్యాలయాలకు హాజరుకాలని, కనీసం మూడు రోజులు చొప్పున పనిచేయాలని అందులో తెలిపింది. ఉద్యోగుల రోస్టర్ వివరాలను మేనేజర్లు పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించింది. ప్రస్తుతం డీఎఫ్‌ఎస్ డివిజన్‌లో 80 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. శిక్షణలో ఉన్న ఫ్రెషర్లు మాత్రం వారానికి ఐదు రోజులూ కార్యాలయాలకు రావాల్సి ఉంటుందని ఐటీ కంపెనీ స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే అనధికారిక గైర్హాజరీగా పరిగణిస్తామని కంపెనీ పేర్కొంది. అలాంటివారిపై కంపెనీ పాలసీకి అనుగుణంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.