గూగుల్ కీలక నిర్ణయం.. కొత్త నియామకాలకు బ్రేక్
గూగుల్ 2022లో మిగిలిన ఆరు నెలల కాలంలో కొత్త ఉద్యోగ నియామకాలను తగ్గించుకోనుంది. ఈ విషయాన్ని సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులకు తెలియజేశారు. ఇంజనీర్లు, టెక్నికల్, ఇతర కీలక పోస్టులకు నియామకాలనే గూగుల్ కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఉద్యోగులకు ఒక మెమో పంపించారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. గూగుల్ ఆర్థిక అనిశ్చితుల ప్రభావానికి పెద్దగా లోను కాలేదని చరిత్ర స్పష్టం చేస్తోంది. ఎందుకంటే గూగుల్ సేవలు, ఉత్పత్తులు నిజజీవితంలో భాగమైనవి, పైగా సంస్థకు చెందిన యూట్యూబ్ అన్నిటికంటే ఎక్కువ వృద్ధితో దూసుకుపోతోంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో గూగుల్ 10,000 మందిని నియమించుకున్నట్టు పిచాయ్ తెలిపారు.
ఈ ఏడాదిలో ఇక సాధారణ నియామాకాలు ఉండవని స్పష్టం చేశారు. కానీ 2022 మిగిలిన భాగం 2023లో మేము ఇంజనీరింగ్, టెక్నికల్, ఇతర కీలక పోస్టులకు నియామకాలు చేపడతాం. కంపెనీ వృద్ధి ప్రాధాన్యతలకు అనుగుణంగా నైపుణ్య మానవ వనరులను తీసుకుంటాం అని పిచాయ్ తెలిపారు. అలాగే ఉన్న ఉద్యోగులను సైతం అధిక ప్రాధాన్య విభాగాల్లో నియమిస్తామని, ఆ సమయంలో ఇతర ప్రాజెక్టులను నిలిపివేస్తామని సుందర్ పించాయ్ ప్రకటించారు.






