Markets: మార్కెట్ల పతనంపై ఆందోళన వద్దంటున్న ట్రంప్…

ఫ్లోరిడా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేల్చిన టారిఫ్‌ల (Trump Tariffs) బాంబుతో అగ్రరాజ్యం సహా ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. దీంతో ఆర్థిక మాంద్యం భయాలు నెలకొన్నాయి. ఈ పరిస్థితులపై తాజాగా ట్రంప్ (Donald Trump) స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు అనారోగ్యాన్ని బాగు చేసుకోవాలంటే చేదుగా ఉన్నా సరే మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇక, వాణిజ్య లోటు పరిష్కారమయ్యేవరకు సుంకాలు తగ్గించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
‘‘ప్రపంచ మార్కెట్లు పతనమవ్వాలని నేను కోరుకోలేదు. భారీ అమ్మకాల గురించి కూడా ఆందోళన చెందడం లేదు. ఎందుకంటే కొన్నిసార్లు సమస్య పరిష్కారం కోసం మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుంది. నేను చాలామంది నేతలతో మాట్లాడా. యూరప్, ఆసియా దేశాధినేతలతో చర్చించా. ఇప్పుడు వాళ్లు మాతో ఒప్పందం కుదుర్చుకోవడం కోసం ఆరాటపడుతున్నారు. వారికి నేను ఒకటే చెప్పా.. వాణిజ్య లోటును మేం కొనసాగించలేం. అది పరిష్కారమైతేనే టారిఫ్‌లపై చర్చలకు ముందుకొస్తాం’’ అని ట్రంప్ వెల్లడించారు.
చైనా, ఈయూ దేశాలతో భారీ ఆర్థికలోటుకు సుంకాలే తగిన పరిష్కారమని ట్రంప్ ఈసందర్భంగా పేర్కొన్నారు. తన చర్యల ఫలితంగా అమెరికాలోకి బిలియన్ డాలర్ల ప్రవాహం మొదలైందని వ్యాఖ్యానించారు. పాలనా కాలంలో బైడెన్ నిద్రపోవడం వల్ల వివిధ దేశాల మిగులు పెరిగిపోయిందని విమర్శించారు. టారిఫ్‌ల అంశంపై ఇప్పటికే భారత్ సహా 50 దేశాలు అమెరికా సర్కారుతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.మరోవైపు, ట్రంప్ సుంకాల ప్రభావం ఈ వారం కూడా మార్కెట్లపై తీవ్రంగానే ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి.