శ్రీమంతుల జాబితాలో దూసుకుపోతున్న అదానీ
దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీ సంపద రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది. దేశంలో అత్యంత సంపన్నుడిగా అవతరించిన అదానీ ప్రపంచ శ్రీమంతుల జాబితాలో దూసుకుపోతున్నారు. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్‌ను అధిగమించి నాలుగో స్థానం పొందారు. ఈ విషయాన్ని ఫోర్బ్స్ తాజాగా వెల్లడించింది. బిల్‌గేట్స్ తన సంపదలో 20 బిలియన్ డాలర్లను లాభాపేక్ష లేని సంస్థకు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో ఆయన సంపద భారీగా తగ్గింది. దీంతో 102 బిలియన్ డాలర్లతో బిల్ గేట్స్‌తో ఐదో స్థానానికి పడిపోగా గౌతమ్ అదానీ 114 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలోకి వచ్చినట్లు ఫోర్బ్స్ పేర్కొంది. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు 20 బిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు గత వారం గేట్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.






