రూ.4500 కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి
విదేశీ ఇన్వెస్టర్లు భారీగా భారత్ ఈక్విటీ మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వు వేగంగా వడ్డీ రేట్లను పెంచనుందనే అంచనాలతో వారు గత కొద్ది నెలలుగా పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. గత వారం దాదాపు రూ.4500 కోట్ల విలువచేసే పెట్టుబడులను విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. అయితే ఏప్రిల్ 1 నుంచి 8 వరకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐ) రూ.7,707 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. దీనికి ముందు ఎఫ్‌పిఐలు 2022 మార్చి వరకు ఆరు నెలలుగా నికర విక్రేతలుగానే ఉండగా, అప్పటి వరకు దాదాపు రూ.1.48 లక్షల కోట్ల నిధులను ఉపసంహరించుకున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్ల పెంపు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు పెరుగడం అంశాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.






