ఓపెన్ ఏఐ, సీఈఓపై ఎలాన్ మస్క్ కేసు

లాభాలను ఆర్జించడం కంటే, మానవాళికి మేలు చేయడమే తమ సంస్థ లక్ష్యమని చెప్పి, ఇప్పుడు ఆ మాట తప్పారని ఆరోపిస్తూ ఓపెన్‌ఏఐ, ఆ సంస్థ సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌పై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కేసు వేశారు. లాభాపేక్ష రహితంగా ఉంటూ, ప్రజల ప్రయోజనార్థం సాంకేతికతను అభివృద్ధి చేసే సంస్థగా ఉండాలని ఓపెన్‌ఏఐ ఏర్పాటు సమయంలో ఆల్ట్‌మన్, ఆ సంస్థ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్ మన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో దాఖలు చేససిన పిటిషన్‌లో మస్క్ పేర్కొన్నారు. ఏ ఒక్క ప్రైవేట్ కంపెనీకి లాభాలను తెచ్చిపెట్టేందుకు కాకుండా తన కోడ్‌ను ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు కూడా వ్యవస్థాపిత ఒప్పందంలో ఓపెన్ ఏఐ పొందుపరిచినట్లు వివరించారు. అయితే మైక్రోసాఫ్ట్‌తో సన్నిహిత సంబంధాన్ని కొనసాగించడం ద్వారా ఓపెన్‌ఐఏ, ఆ సంస్థ ఉన్నతాధికారులు ఈ ఒప్పంద ఉద్దేశాన్ని నీరుగార్చారని మస్క్ ఆరోపించారు.
ప్రపంచంలోని అతిపెద్ద సాంకేతిక కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్‌కు అనధికారిక అనుబంధ సంస్థగా ఓపెన్‌ఏఐ మారిపోయింది. మానవాళి ప్రయోజనం కోసం కాకుండా మైక్రోసాఫ్ట్ లాభాలను పెంచేందుకు ఓపెన్‌ఏఐ కొత్త బోర్డు పనిచేస్తోందని మస్క్ ఆరోపించారు. ఒప్పంద ఉల్లంఘన, అనైతిక వ్యాపార పద్ధతులను అనుసరిస్తున్నట్లు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఓపెన్‌ఏఐ సాంకేతికత నుంచి మైక్రోసాఫ్ట్ సహా ఏ సంస్థా ప్రయోజనం పొందకుండా ఆంక్షలు విధిస్తూ, ఆదేశాలు జారీ చేయాల్సిందిగా మస్క్ కోర్టును కోరారు.