రూ.294 కోట్లతో భవనం కొన్న ప్రపంచ కుబేరుడు

టెస్లా మోటార్స్ సీఈవో, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన 11 మంది పిల్లల కోసం ఒక కొత్త భవనం కొన్నారు. పిల్లలతోపాటు వారి తల్లులను కూడా ఒక కప్పు కిందకు చేర్చేందుకు ఈ 294 కోట్లు వెచ్చించారు. అమెరికాలోని టెక్సాస్ రాజధాని ఆస్టిన్‌లో ఈ విలాసవంతమైన భవనం ఉంది. మస్క్‌కు 12 మంది సంతానం. మొదటిభార్య జస్టిస్‌కు పుట్టిన తొలిబిడ్డ అనారోగ్య కారణాలతో పది వారాలకే మృతి చెందింది. తర్వాత ఆ జంట ఐవీఎఫ్ పద్ధతిలో అయిదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. 2008లో దంపతులిద్దరూ విడిపోయారు. దీంతో బ్రిటన్ నటి తాలులాప్‌ా రిలేను మస్క్ వివాహమాడారు. వీరికి సంతానం లేదు. కెనడియన్ గాయని గ్రిమ్స్ తోనూ ఆయన సంబంధం నెరిపారు. వీరికి ముగ్గురు పిల్లలు. తన ప్రతిష్ఠాత్మక సంస్థ బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్‌లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్‌తోనూ మరో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చినట్లు ఇటీవల మస్క్ బహిర్గతం చేశారు. వీరంతా ఒకేచోట ఉంటే పరస్పరం సహకరించుకుంటారని, అందరికీ సమయం కేటాయించడం తనకూ వీలవుతుందని మస్క్ భావించారు. దీంతో 14,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భవనం, దాని పక్కనే ఆరు పడకగదులతో కూడిన ఇంటిని 35 మిలియన్ల డాలర్లతో (రూ.294.30 కోట్లు) ఆయన కొనుగోలు చేసినట్లు తెలిసింది.