Trump: ట్రంప్ ఒక్కటి గుర్తుంచుకో.. ఇక్కడ ఉన్నది డ్రాగన్..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాలు విధించడంపై చైనా మండిపడుతోంది. ఏకంగా 104 శాతానికి సుంకాలు చేరడం.. డ్రాగన్ కంట్రీ తీవ్రంగా స్పందించింది. అమెరికా విధిస్తున్న సుంకాల (Trump Tariffs on China)పై చైనా ప్రీమియర్ లీ కియాంగ్ తీవ్రంగా స్పందించారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, తగినవిధంగా బదులిచ్చేందుకు తమ వద్ద విధానపరంగా అన్ని ఆయుధాలు ఉన్నాయని వెల్లడించారు. యూరప్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డిర్‌తో ఫోన్ కాల్ సందర్భంగా లీ కియాంగ్ (Chinese Premier Li Qiang) ఈ వ్యాఖ్యలు చేశారు.
సుంకాల పేరుతో అమెరికా (USA) బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోంది. దీనిపై మేం చివరివరకు పోరాడతాం. ఎలాంటి అనిశ్చితులనైనా తట్టుకునేలా మా ఆర్థిక విధానాలను రూపొందించాం. వాణిజ్య భాగస్వాములందరిపైనా ట్రంప్ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు.. అమెరికా ఏకపక్షవాదం, రక్షణవాదం, ఆర్థికపరంగా బలవంతపు చర్యలకు అద్దం పడుతున్నాయి. దీనికి మేం తప్పకుండా ప్రతిస్పందిస్తాం. సొంత ప్రయోజనాల కోసమే గాక.. అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను కాపాడేందుకు పోరాడుతాం’’ అని చైనా (China) ప్రీమియర్ వెల్లడించారు.
పలు దేశాలు తమ వస్తువులపై అధిక సుంకాలు విధిస్తూ తమ ఆర్థిక వ్యవస్థను కొల్లగొడుతున్నాయని ట్రంప్ పలు సార్లు ఆరోపించారు.ఈ క్రమంలోనే ఇటీవల అన్నిదేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. గత మార్చి వరకు చైనా వస్తువులపై అమెరికా 10 శాతం సుంకాలు విధిస్తూ వచ్చింది. ఇటీవల పెంచిన సుంకాలతో కలిసి చైనాపై మొత్తం సుంకాలు 54 శాతానికి చేరుకున్నాయి. దీనికి బీజింగ్ తీవ్రంగా స్పందించింది. అగ్రరాజ్యం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34శాతం అదనపు సుంకం విధించాలని నిర్ణయించింది. దీంతో భగ్గుమన్న ట్రంప్.. టారిఫ్ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. డ్రాగన్ వెనక్కి తగ్గకపోవడంతో అదనంగా మరో 50శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా నిర్ణయంతో బీజింగ్‌పై మొత్తం సుంకాలు 104 శాతానికి చేరుకున్నాయి.