CHINA: పెద్దన్న టారిఫ్ లపై చైనా ఆగ్రహం.. ప్రతీకార సుంకాల విధింపు

అగ్రరాజ్యం అమెరికా తమపై టారిఫ్ విధించడంపై చైనా (China) అంతే దీటుగా స్పందించింది. చెప్పినట్లుగానే అమెరికా విధించినంత శాతాన్ని తాము కూడా అమెరికా ఉత్పత్తులపై విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 34 శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. అమెరికా విధించిన సుంకాలను చైనా తీవ్రంగా తప్పుపట్టింది. అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని ఆరోపించింది. అమెరికా ఆర్థిక బెదిరింపులకు పాల్పడుతోందని ధ్వజమెత్తింది. ఈ నేపథ్యంలోనే అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు చైనా వెల్లడించింది. ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయని చైనా పేర్కొంది.
తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) స్పందించారు. చైనా భయపడిందని.. తప్పుడు నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించారు. వాళ్లకు మరొక మార్గం లేదన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. అయితే ఈ ఆంక్షలతో చైనాయే తీవ్రంగా నష్టపోవడం ఖాయమన్నారు ట్రంప్. తమను ఏళ్లతరబడి సుంకాలతో దోచుకున్న దేశాలపై… తిరిగి ట్యాక్సులు విధిస్తున్నట్లు తెలిపారు ట్రంప్.
అమెరికా విధించిన సుంకాలపై పలు దేశాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. స్నేహం చేస్తూనే.. మిత్ర దేశాలపై ఇలా సుంకాలు విధించడం సరైంది కాదని ఆయా దేశాలు పరోక్షంగా నిరసన వ్యక్తం చేశాయి. దీనిపై కొన్ని దేశాలు అదనపు సుంకాలు విధించగా.. మరికొన్ని దేశాలు అమెరికాతో చర్చించి, ట్యాక్సులను తగ్గించడం లేదా ఉపసంహరించుకునేలా చేసేప్రయత్నాల్లో ఉన్నాయి. అయితే అక్కడున్నది ట్రంప్ .. మరి ఎలా వ్యవహరిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది.