Chandrababu : చంద్రబాబు రీయలైజ్ అవుతున్నారా..!?
తెలుగుదేశం పార్టీ (TDP)లో ఇటీవల కొంతమంది నేతలు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ, అంతర్గత విభేదాలను బహిరంగపరుచుకోవడంపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasa Rao), విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (Kesineni Chinni) మధ్య తారస్థాయికి చేరిన వివాదాలపై ఆయన గట్టిగా స్పందించారు. యువతకు, కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తే, వాళ్లు పార్టీ ప్రతిష్ఠకే భంగం కలిగిస్తున్నారంటూ చంద్రబాబు ఆవేదన చెందినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పార్టీ సిద్ధాంతాలు, కట్టుబాట్ల గురించి తెలియనివారికి, రాజకీయ అనుభవం లేనివారికి టికెట్లిస్తే ఇలాంటి సమస్యలే వస్తాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాను కూడా ఈ విషయంలో తొందరపడ్డానేమో! అని నిట్టూర్చినట్లు సమాచారం. వాళ్ల వ్యవహారశైలిని కొంతకాలం చూశాక టికెట్లు ఇవ్వాల్సిందని అంతర్మథనం చెందారని తెలుస్తోంది. యువతను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో టికెట్లు ఇస్తే, పార్టీ పరువు ఇలా బజారుకు ఎక్కిస్తున్నారని, పార్టీ గుర్తుపై గెలిచామని మర్చిపోతే ఎలాగని ఆయన ప్రశ్నించారు. పార్టీ విధానాల్ని అనుసరించకుండా, సొంత ఎజెండాతో వెళ్లాలనుకున్నవారు స్వతంత్రంగా పోటీ చేస్తే వారి సత్తా ఏంటో తెలిసేదిని, పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టే గెలిచామనే విషయం గుర్తు పెట్టుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. వ్యక్తిగత ఇమేజ్ కోసం ప్రయత్నం చేసేవారు బయటకు వెళ్లి స్వతంత్రంగా పోటీ చేయవచ్చని తేల్చి చెప్పారు.
కొలికపూడి, కేశినేని చిన్నిల వ్యవహారంపై చంద్రబాబు సీరియస్గా ఉన్నారు. ఈ విభేదాల విషయాన్ని పార్టీ క్రమశిక్షణా కమిటీకి అప్పగించారు. ఇద్దరు నేతలను విడివిడిగా పిలిచి, వారి నుంచి వివరణ తీసుకుని నివేదికను తనకు సమర్పించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సహా ఇతర నేతలను ఆయన ఆదేశించారు. లండన్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత తాను స్వయంగా ఇద్దరితోనూ మాట్లాడతానని, ఆలోగా విభేదాలు కొలిక్కి రాకుంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎవర్నీ బతిమలాడాల్సిన పనిలేదని, తీరు మార్చుకోకపోతే ఉపేక్షించబోమని గట్టిగా చెప్పాలని సూచించారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వేటు తప్పదనే అభిప్రాయం పార్టీలో బలంగా వ్యక్తమవుతోంది.
పార్టీ నేతల మధ్య విభేదాలపై అసహనం వ్యక్తం చేయడమే కాకుండా, చంద్రబాబు మరికొన్ని కీలక అంశాలపై కూడా దృష్టి సారించారు. కొందరు ఎమ్మెల్యేలు అర్హులైన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) సిఫార్సు లేఖలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, మరికొందరు చెక్కులు గడువు ముగిసే వరకు తమ దగ్గరే పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. అలాంటి ఎమ్మెల్యేల జాబితాను తనకు ఇవ్వాలని ఆదేశించారు. తుపానుపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో పార్టీ నేతలు విఫలమయ్యారని అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు మద్యం వ్యాపారానికి దూరంగా ఉండాలని, వాళ్ల వల్ల పార్టీకి మచ్చ వస్తుందని హెచ్చరించారు. లండన్ పర్యటన నుంచి తిరిగొచ్చాక త్వరలోనే పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీలను ప్రకటిస్తామని తెలిపారు.
పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా, పార్టీ సిద్ధాంతాలకు, క్రమశిక్షణకు కట్టుబడని నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయం.. పార్టీలో నూతన ఒరవడికి, క్రమశిక్షణకు ప్రాధాన్యత పెంచే దిశగా ఆయన ప్రయత్నిస్తున్నారని సూచిస్తోంది. అదే సమయంలో ఆయన పార్టీపైన ఇప్పుడిప్పుడే దృష్టి పెడుతున్నారని, లోపం ఎక్కడుందో తెలుసుకుంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.







