Jogi Ramesh : నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ సంచలన నిర్ణయం..!!
ఆంధ్రప్రదేశ్‌లో (AP) సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ (Fake Liquor) కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ (Jogi Ramesh) పేరు ఈ కేసులో తెరపైకి రావడంతో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో జోగి రమేష్ ఈ కేసులో నిజా నిజాలు బయటకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. కనకదుర్గమ్మ సాక్షిగా తనకు ఈ కేసుతో సంబంధం లేదని ప్రమాణం చేశారు. తాజాగా.. ఈ కేసును సీబీఐకి ్ప్పగించాలంటూ జోగి రమేశ్, ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వచ్చే మంగళవారం ఈ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.
నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్ధన్ రావును (Janardhan Rao) పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. జనార్ధన్ రిమాండ్‌లో ఉన్న సమయంలోనే ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో, జోగి రమేష్ చెబితేనే తాను నకిలీ మద్యం తయారీ చేశానని జనార్ధన్ చెప్పినట్లు ఉంది. జనార్ధన్‌తో పాటు అతని సోదరుడు జగన్మోహన్ రావును కూడా ఎక్సైజ్, సిట్ అధికారులు కస్టడీకి తీసుకుని విచారించారు. జోగి రమేష్ ప్రోద్బలంతోనే ఈ వ్యాపారం ప్రారంభించినట్లు వారు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయంలో తగిన ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.
జోగి రమేష్ తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అని, పాలకపక్షం తనను ఇరికించడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో నకిలీ మద్యం సరఫరాను తాను నిలదీయడం ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేక పోయారని ఆయన అంటున్నారు. ఈ కేసులో నిజాయితీ నిరూపించుకోవడానికి తాను సీబీఐ దర్యాప్తు, లై డిటెక్టర్ టెస్ట్, నార్కో అనాలిసిస్ వంటి వాటికి కూడా సిద్ధమని ప్రకటించారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి బెజవాడ కనకదుర్గమ్మ గుడి వద్ద ప్రమాణం కూడా చేశారు. జోగి రమేష్ తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెర వెనుక సూత్రధారులు, పాత్రధారులు, నిజా నిజాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణే కరెక్ట్ అని పేర్కొన్నారు.
అయితే, అధికార పార్టీ నాయకులు మాత్రం నకిలీ మద్యం తయారీలో జోగి రమేష్ పాత్రకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, అందుకే ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోందని కౌంటర్ ఇస్తున్నారు. జనార్ధన్ రావు ఇచ్చిన వాంగ్మూలం, వీడియో, ఆర్థిక లావాదేవీల ఆధారంగా త్వరలో జోగి రమేష్‌ను నిందితుడిగా చేరుస్తూ కోర్టులో మెమో దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ అంశంపై ఏపీ హైకోర్టు వచ్చే మంగళవారం విచారణ చేపట్టనుంది. దీంతో ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో అని రాష్ట్ర రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.







