అమెరికాలో బీమాపై బరువు తగ్గించే ఔషధాలు

బరువు తగ్గించే ఒజెంపిక్, వెగోలీ వంటి ఔషధాలను అమెరికా ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాలైన మెడికెయిడ్, మెడికేర్‌ల ద్వారా లక్షలాది అమెరికన్ ప్రజలకు అందించాలని జో బైడెన్ సర్కారు ప్రతిపాదించింది. దీనివల్ల వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వ ఖజానాపై 3,500 కోట్ల డాలర్ల అదనపు భారం పడుతుంది. ఈ ప్రతిపాదనలు అమలు కావాలంటే జనవరిలో పదవీ స్వీకారం చేసే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆమోద ముద్ర అవసరం. ఈ ఔషధాలపై ట్రంప్ వైఖరి ఏమిటో తెలియదుగానీ, ఆయన ఆరోగ్య మంత్రిగా నామినేట్ చేసిన రాబర్ట్ కెనడీ జూనియర్ మాత్రం బరువు తగ్గడానికి మందులపై కన్నా ఆర్గానిక్ ఆహారం, వ్యాయామాలపై ఆధారపడటం మేలని వాదిస్తున్నారు. ఇంజెక్షన్ రూపంలో తీసుకునే ఒజెంపిక్, వెగోవీ వంటి ఔషధాలపై నెలకు లక్ష రూపాయలకన్నా ఎక్కువే ఖర్చువుతుంది. అందులో సగం ధరకే పౌరులకు మంచి ఆహారం, వ్యాయామ శిక్షణ కేంద్రాల్లో సభ్యత్వం ఇవ్వవచ్చని కెనడీ వాదం. ఆయనను ఆరోగ్య మంత్రిగా సెనెట్ ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.