Air India: ఎయిర్ ఇండియా శుభవార్త.. విద్యార్థులకు

ఎయిర్ ఇండియా(Air India) తన దేశీయ, అంతర్జాతీయ రూట్ నెట్‌వర్క్‌లోని విద్యార్థులకు ప్రత్యేక తగ్గింపు ఛార్జీలు, అదనపు ప్రయోజనాలను ప్రారంభించింది. విద్యార్థుల (Students) కు అన్ని విమానాల్లో బేస్ ఛార్జీలపై 10 శాతం వరకు తగ్గించడమే కాకుండా, అదనంగా 10 కేజీల వరకు లగేజీని తీసుకెళ్లడానికి అనుమతినిస్తుంది. ఎయిర్ ఇండియా వెబ్‌సైట్, మొబైల్ యాప్‌తో సహా ఎయిర్ ఇండియా (Air India) కు సంబంధించిన డైరెక్ట్ ఛానెల్స్‌లో బుకింగ్ చేసిన తర్వాత ఒకసారి తేదీ మార్పుకు కూడా (ఉచిత) అనుమతి ఉంటుంది.
ఈ ప్రత్యేక విద్యార్థి ఛార్జీలు ఇప్పుడు ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్యాబిన్స్‌లో బుకింగ్‌లకు అందుబాటులో ఉన్నాయని ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ నిపున్ అగర్వాల్ (Nipun Agarwal) తెలిపారు. భారత్‌లోని 49 నగరాలకు విదేశాల్లో 42 గమ్యస్థానాల మధ్య ఎయిర్ ఇండియా నాన్‌స్టాప్ సర్వీసులను నిర్వహిస్తోంది. యూఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియాతో సహా మరికొన్ని గమ్యస్థానాల్లో దేని మధ్యనైనా ప్రయాణించే విద్యార్థులు ఇప్పుడు మరింత సులభంగా, తగ్గింపు ఛార్జీలతో ప్రయాణం చేయొచ్చు. ప్రస్తుతం వీరికి ఎయిర్ ఇండియా మొబైల్ యాప్ బుకింగ్‌లపై ఎటువంటి రుసుమును వసూలు చేయడం లేదు.