భారత్, అమెరికా మధ్య ఎయిరిండియా సర్వీసులు ప్రారంభం
5జీ అంతర్జాల సేవల కారణంగా విమాన సేవలకు అంతరాయం కలుగుతుందన్న ఆందోళనల నేపథ్యంలో భారత్, అమెరికా మధ్య రద్దయిన సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు ఎయిరిండియా ప్రకటించారు. ఇరు దేశాల మధ్య నేటి నుంచి అన్ని సర్వీసులు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. 5జీ ఆందోళనలతో రద్దు చేసిన 8 సర్వీసుల్లో ఆరింటిని (బోయింగ్ 777 విమానాలు) తిరిగి ప్రారంభించినట్లు వెల్లడిరచింది. బోయింగ్ సంస్థ నుంచి అందుకు అవసరమైన అనుమతులు వచ్చినట్లు పేర్కొంది.
అమెరికా విమానయాన నియంత్రణ సంస్థ `ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. బోయింగ్ 777 రకం సహా అన్ని విమానాల అల్టీమీటర్లపై 5జీ ప్రభావం ఉండబోదని స్పష్టం చేసింది. వెంటనే ఆ తరగతి విమానాలను అమెరికాకు నడిపేందుకు వీలుగా ఎయిరిండియాకు బోయింగ్ పచ్చజెండా ఊపింది. మరోవైపు బ్రిటిష్ ఎయిర్వేస్, లుఫ్తాన్సా, ఎమిరేట్స్, జపాన్ ఎయిర్లైన్స్ వంటి ప్రముఖ విమానయాన సంస్థలు కూడా అమెరికాకు విమాన సర్వీసులను పున రుద్ధరిస్తున్నట్లు ప్రకటించాయి.






