Donald Trump : భారత్, అమెరికా మధ్య .. ట్రంప్ పెట్టిన మరో చిచ్చు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump )నిర్ణయాలు భారత్, అమెరికాల సంబంధాలను తీవ్ర స్థాయిలో దెబ్బతీస్తున్నాయి. తాజాగా అత్యంత వివాదాస్పదమైన వ్యక్తుల్లో ఒకరైన సెర్గియో గోర్ (Sergio Gore ను భారత్‌లో అమెరికా రాయబారిగా, దక్షిణ, మధ్య ఆసియాల పర్యవేక్షకుడిగా నియమించడం దౌత్యవర్గాలకు షాక్ కు గురి చేసింది. ఒకప్పుడు భారత్ తీవ్రంగా వ్యతిరేకించిన పనినే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు బలవంతంగా చేశారు.గోర్ నియామకంపై భారత్‌లో మిశ్రమ స్పందన వస్తోంది. విదేశీ వ్యవహారాల నిపుణుడు, మాజీ దౌత్యవేత్త కన్వల్ సిబల్ (Kanwal Sibal) స్పందిస్తూ ..భారత్‌లో నియమించిన దౌత్యవేత్తను దక్షిణ, మధ్య ఆసియాకు ప్రత్యేక దూతగా నియమించడం ఇదే తొలిసారి అని తెలిపారు. పాకిస్థాన్ (Pakistan) సహా పొరుగు దేశాలతో భారత్‌కు ఉన్న సంబంధాలను ఆయన గమనిస్తారని పేర్కొన్నారు. ఈ చర్య భారత్, పాకిస్థాన్‌ను ఒకేగాటన కట్టినట్లవుతుందని, ఇలాంటి అమెరికా వైఖరిని భారత్ గతంలో తీవ్రంగా వ్యతిరేకించిందని వివరించారు. ఇక భారత్, అమెరికా (America) సంబంధాల్లో ఇండో పసిఫిక్ ప్రాధాన్యం కనుమరుగవుతుందని తెలిపారు. మరో మాజీ దౌత్యవేత్త నిరుపమా రావ్ కూడా డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశాలను ప్రశ్నించారు. ఈ నియామకం భారత్, అమెరికా సంబంధాలను దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు.






